ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న యుద్ధం మన దేశ మెడిసిన్ స్టూడెంట్ల భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చేసింది. వేల మంది స్టూడెంట్లు అక్కడికి ఎంబీబీఎస్ చదువుకునేందుకు వెళ్లి అర్ధాంతరంగా తిరిగి వచ్చేస్తున్నారు. అయితే అక్కడ మధ్యలోనే ఆపేసిన చదువును ఇక్కడ పూర్తి చేసేందుకు నిబంధనలు అనుమతించవు. ఉక్రెయిన్ లో పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికీ స్పష్టత లేకుండా ఉంది. దీంతో మెడిసిన్ స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు.
రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా చాలా దేశాలపై ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావం మన దేశంపై కూడా పడింది. ఫిబ్రవరి 24, 2022న తెల్లవారుజామున రాజధాని నగరం కైవ్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించిన నాటి నుంచి అక్కడ నుంచి ప్రజలు పారిపోవడం ప్రారంభించారు. ఇందులో మన భారతీయులు కూడా ఉన్నారు. అక్కడ నివసించే భారతీయుల్లో అధిక శాతం మంది మెడిసిన్ చదవడం కోసం ప్రత్యేకంగా వెళ్లినవారు ఉన్నారు. అయితే ఈ సంక్షోభం వల్ల వారంతా తిరిగి వస్తున్నారు. దీంతో వారి మెడిసిన్ డిగ్రీ చదువు ప్రశ్నార్థకంగా మారింది.
ఉక్రెయిన్ పై దాడి జరిగిన నాటి నుంచి ఇండియన్ స్టూడెంట్లు అక్కడ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇటు ఇండియాకు రాలేక, అటు అక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే చాలా మందిని ఇండియాకు తీసుకొచ్చారు. వారిలో చాలా మంది వారి కుటుంబ సభ్యులను కలిశారు. అయితే ఇండియాను వదిలి అక్కడ ఉంటున్న వారిలో MBBS స్టూడెంట్లే అధికంగా ఉన్నారు.
మన దేశంలో మెడిసిన్ చదువు చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలంటే తప్పని సరిగా నీట్ (NEET) స్కోర్‌లు అవసరం. అయితే మన దేశంలో పోలిస్తే ఉక్రెయిన్ లో మెడిసిన్ కొంత తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. అలాగే అక్కడ నీట్ స్కోర్ ను పరిగణలోకి తీసుకోరు. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదివి వచ్చిన వారికి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈ కారణాల వల్ల మన దేశం నుంచి చాలా మంది అక్కడికి వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అయితే చాలా మంది చదువు పూర్తికాకుండానే ఇక్కడికి వచ్చేశారు. అక్కడ ఆపేసిన చదువును ఇక్కడ పూర్తి చేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఫారిన్ మెడిసిన్ గ్రాడ్యుయేట్ (FMG) కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) జారీ చేసిన 2021 నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదు. ఆ దేశానికి, మన దేశానికి ప్రవేశ మార్గదర్శకాలు, ఎంపిక ప్రమాణాలు భిన్నంగా ఉన్నందున MBBS కోర్సు మధ్యలో వచ్చిన ఫారెన్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్ మధ్యలో ఇండియన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడానికి అనుమతి లేదు.
మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి ?
ఫారెన్ లో మెడిసిన్ పూర్తి చేసిన తరువాత ఆ స్టూడెంట్లు తమ కోర్సును పూర్తి చేసిన అదే వైద్య సంస్థలో 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. అనంతరం భారతదేశంలో మరో ఇంటర్న్ షిప్ పూర్తి చేయాలి. అది కూడా వారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌ను క్లియర్ చేసిన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది. 2021 FMG నిబంధనల ప్రకారం ఒక MBBS స్టూడెంట్ చదువు స్టార్ట్ చేసిన నాటి నుంచి వారి కోర్సును పూర్తి చేయడానికి, ఇండియాలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్టంగా 10 సంవత్సరాలు అవకాశం ఉంటుంది.
ఉక్రెయిన్ సంక్షోభం మెడిసిన్ స్టూడెంట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
ఉక్రెయిన్‌లో MBBS డిగ్రీ పూర్తి చేయాలంటే సగటున ఆరు సంవత్సరాలు పడుతుంది. FMG నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల ఇంటర్న్‌షిప్‌లు (ఉక్రెయిన్, భారతదేశంతో కలిపి) చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఎనిమిది సంవత్సాలు అవుతుంది. వారు FMGE కోసం దరఖాస్తు చేసుకోవడానికి, లైసెన్స్‌ని పొందడానికి మరో రెండేళ్లు మిగిలి ఉంటుంది.
ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ మెడిసిన్ స్టూడెంట్లు తమ విద్యను పూర్తి చేయడానికి ఉక్రెయిన్‌కు ఎప్పుడు తిరిగి వెళ్తారనే విషయం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అందువల్ల 10 సంవత్సరాల నిబంధన వీరికి సమస్య కలిగించే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాల్లో కోర్సు పూర్తి కాకపోతే భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కోల్పొతారు.
ఇప్పుడు ఏం జరగొచ్చు ?
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. FMGలను భారతీయ విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలలో నమోదు చేసుకోవడానికి అనుమతించే లేదు. అయితే ‘లేటరల్ ఎంట్రీ’ లాంటి కొత్త నిబంధన వస్తుందా అనేది కూడా క్లారిటీ లేదు. చాలా మంది NMC అధికారులు విద్యార్థులు వేచి ఉండాలని, సంక్షోభం సద్దుమణిగితేనే ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.
"అభ్యర్థులకు వారి చివరి సంవత్సరంలో స్టేక్స్ ఎక్కువగా ఉంటాయి. యూనివర్సిటీలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ? మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాము అనే దానిపై స్పష్టత లేదు. మేమందరం ఇప్పుడు మా భవిష్యత్తుపై స్పష్టత లేకుండా విశ్వవిద్యాలయాన్ని విడిచిపెడుతున్నాము ’’ అని ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా స్టేట్ మెడికల్ యూనివర్శిటీ మెడికల్ స్టూడెంట్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులకు సడలింపుల విషయంలో ఇప్పటికైతే ఎలాంటి ప్రణాళికలు లేవు. ‘ఆపరేషన్ గంగా’ పూర్తిగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అక్కడి నుంచి వారిని ఇండియాకు తీసుకురావడంపైనే పూర్తిగా దృష్టి పూర్తి కేంద్రీకరించింది. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతున్నందున నేపథ్యంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు సడలింపులకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో అభ్యర్థులను NEET కోసం హాజరవ్వాలని సూచించి, కోర్సు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడం ఒక ఆప్షన్. అయితే ఖర్చుల కారణంగా విద్యార్థులందరికీ ఆమోదయోగ్యం కాదు.
