ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను తీసుకొచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. మంగళవారం తొమ్మిదో తరలింపు విమానం విద్యార్థుల కోసం అక్కడికి వెళ్లనుందని చెప్పారు.
యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లోని నగరాల్లో, సరిహద్దు ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తరలించడానికి భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి భారతీయులను తిరిగి తీసుకురావడానికి మూడు తరలింపు విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రొమేనియా రాజధాని నగరం బుకారెస్ట్ (Bucharest) నుండి రెండు విమానాలు, హంగేరి రాజధాని బుడాపెస్ట్ (Budapest) నుంచి ఒక విమానం వెళ్లి రానున్నాయి. ఈ విమానాలు ముంబై, ఢిల్లీలో ల్యాండ్ అవుతాయి.
నేడు తొమ్మిదో ఎవాక్యూయేషన్ ఫ్లైట్‌ను ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం పంపిస్తున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ (s jaishankar) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో వివరాలు వెల్లడించారు. ‘‘ మా తోటి భారతీయులు సురక్షితంగా ఉండే వరకు మేము విశ్రమించబోము’’ అంటూ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు చేస్తున్న చర్యలను నిరంతరం ఆయన ట్విట్టర్ ద్వారా ఆప్ డేట్ చేస్తున్నారు.
ఉక్రెయిన్ నుంచి తరలివెళ్లిన 182 మంది భారతీయ పౌరులతో కూడిన ఏడో ఎయిర్ ఇండియా (air india) విమానం మంగళవారం ఉదయం రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి ముంబై (mumbai) లో దిగినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి పీటీఐతో తెలిపారు. వారికి కేంద్ర MSME మంత్రి నారాయణ్ రాణే ముంబై విమానాశ్రయంలో స్వాగతం పలికారని ఆయన చెప్పారు. బుకారెస్ట్ నుంచి కువైట్ మీదుగా AI ఎక్స్‌ప్రెస్ విమానం IX-1202 ఉదయం 7:40 గంటలకు రన్‌వేని తాకినట్లు ఆయన చెప్పారు.
భారతదేశం తన పౌరులను తరలించాలని యోచిస్తున్న ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతీయుల తరలింపు విషయాలపై వారితో చర్చించారు. కాగా ఈ తరలింపును పర్యవేక్షించడానికి నలుగురు కేంద్ర మంత్రులను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి మరిన్ని విమానాల కోసం ప్రణాళికలను ప్రకటించింది. దీంతో పాటు మానవతా సూచనగా ఉక్రెయిన్‌కు సహాయ సామాగ్రిని పంపుతుంది.ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షించే బాధ్యతను మంత్రులు హర్దీప్ పూరి, కిరణ్ రిజిజు, జ్యోతిరాద్దియా సింధియా మరియు జనరల్ (రిటైర్డ్) VK సింగ్ తీసుకున్నారు.
రష్యా దాడి చేయడం ప్రారంభించిన రోజు నుంచి ఉక్రెయిన్ గగనతలంపై ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్ నుంచి విమానాల రాకపోకలను నిషేదించింది. దీంతో అక్కడ నుంచి ఇండియాకు తిరిగి రావాలని అనుకున్న భారతీయులకు, విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. మొదటి రోజు ఉక్రెయిన్ రాజధాని కైవ్ కు బయలుదేరిన విద్యార్థుల విమానం క్యాన్సిల్ అవడంతో ఇబ్బందులు పడ్డారు. వారిని ఇండియన్ ఎంబసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి, రక్షణ అందించారు. అనంతరం ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి విద్యార్థులను, భారతీయ పౌరులను తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి విమనాల్లో వారిని ఇండియాకు తీసుకొస్తోంది. ఉక్రెయిన్ లోని కైవ్ నగరంలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని ముందుగా రోడ్డు మార్గం గుండా బూకారెస్ట్ కు తీసుకొచ్చి అక్కడి నుంచి వారిని ఇండియాకు తీసుకొస్తోంది. ఈ చర్యలకు భారత ప్రభుత్వం ‘‘ఆపరేషన్ గంగా’’ అని నామకరణం చేసింది.
