పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం గందరగోళం చోటచేసుకుంది. శాసనసభలో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ దద్దరిల్లింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం గందరగోళం చోటచేసుకుంది. బీర్‌భూంలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై బీజేపీ చర్చకు పట్టుబడింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేసింది. దీంతో సభలో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ దద్దరిల్లింది. ఇరుపక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మార్షల్స్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో సువేందు అధికారి, మనోజ్ తిగ్గ, శంకర్ ఘోష్, దీపక్ బర్మన్, నరహరి మహతోలు ఉన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సభలో ప్రకటన చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలోని దాదాపు 25 మంది బిజెపి ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. తమ పార్టీ సభ్యులను టీఎంసీ ఎమ్మెల్యేలు సభ లోపల దూషించారని బీజేపీ నేతలు ఆరోపించారు.
‘అసెంబ్లీ లోపల కూడా ఎమ్మెల్యేలకు భద్రత లేదు.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై సీఎం సభలో ప్రకటన చేయాలని కోరడంతో మా శాసనసభ్యుల్లో కనీసం 8 నుంచి 10 మందిని టీఎంసీ ఎమ్మెల్యేలు కొట్టారు’ అని సువేందు అధికారి ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా.. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమి దాచాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి ఓ వీడియోను అమిత్ మాల్వియా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
అయితే బీజేపీ నేతల ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ డ్రామాలు ఆడుతోందని రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ విలేకరులతో అన్నారు. సభలో తమ ఎమ్మెల్యేలు కొందరు గాయపడ్డారని.. బీజేపీ తీరును ఖండిస్తున్నామని చెప్పుకొచ్చారు.
