ఇండియా అనే పేరు ఇక భారత్ గా మారబోతోందని దేశ వ్యాప్తంగా చర్చ మొదలైన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ స్పందించారు. ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘ఇండియా’’కు బదులుగా ‘‘భారత్’’ అని పలకాలని సూచించారని అన్నారు. ప్రజలంతా భారత్ అని పిలవడం అలవాటు చేసుకోవాలని కోరారని గుర్తు చేశారు. 

రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. రాజ్యాంగ రచనకు కారణమైన భీమ్ రావ్ అంబేడ్కర్ పై ప్రధాని నరేంద్ర మోడీ, మోహన్ భగవత్ కు ఎందుకంత ద్వేషం అని ప్రశ్నించారు. 

‘‘బాబాసాహెబ్ డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో "ఇండియా దట్ ఈజ్ భారత్" అని రాశారు. కానీ బాబాసాహెబ్ ను ద్వేషించే మోడీ, ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాయి. బాబాసాహెబ్ ను భగవత్, మోడీ ఎందుకు అంతగా ద్వేషిస్తారు?’’ అని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్న అంశాలను కూడా సింగ్ వివరించారు. 

కాగా.. ఈ నెల ప్రారంభంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గౌహతిలో సకల్ జైన్ సమాజ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్ అనే పేరు పురాతన కాలం నుండి కొనసాగుతోందని, దీనిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ‘‘మన దేశం పేరు భారత్ అని ఎప్పటి నుంచో ఉంది. భాష ఏదైనప్పటికీ పేరు మాత్రం అలాగే ఉంటుంది’’ అని తెలిపారు. అయితే ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు నరేష్ బన్సాల్ కూడా ఈ ప్రతిపాదనను లేవనెత్తారు. ‘‘ఇండియా’’ అనే పేరు వలసవాద బానిసత్వానికి చిహ్నమని, దానిని రాజ్యాంగం నుంచి తొలగించాలని అన్నారు. 

‘‘బ్రిటీష్ వారు భారత్ పేరును ఇండియాగా మార్చారు. ఆర్టికల్ 1 ప్రకారం 'ఇండియా అంటే భారత్' అని పేర్కొంది. మన దేశం వేల సంవత్సరాలుగా 'భారత్' పేరుతో పిలువబడుతోంది. ఇది ఈ దేశం పురాతన పేరు, పురాతన సంస్కృత గ్రంథాలలో కనిపిస్తుంది. ‘ఇండియా’ అనే పేరు వలస రాజ్యం ఇచ్చింది కాబట్టి అది బానిసత్వానికి చిహ్నం. ఇండియా అనే పేరును రాజ్యాంగం నుంచి తొలగించాలి’’ అని నరేష్ బన్సాల్ తెలిపారు.