కారులో డబ్బుల కలకలం రేగింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలకు చెందిన నగల దుకాణం నిర్వాహకులు కారులో అక్షరాలా రూ.4కోట్లు తరలిస్తుండగా.. పోలీసులకు పట్టుబడ్డారు. తమిళనాడు పోలీసులు వీరి కారులో సోదాలు నిర్వహించగా.. నగదు విషయం వెలుగులోకి వచ్చింది.

వీరంతా స్థానికంగా అధికార వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే వారే అంటూ వార్తలు వస్తుండటం గమనార్హం. కాగా.... కారుపై ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌ కూడా అతికించుకున్నారు. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని ఎళావూరు చెక్‌పోస్ట్‌ వద్ద బుధవారం వేకువజామున తమిళనాడు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

 ఆ సమయంలో టయోటా ఫార్చ్యూనర్‌ కారు చెక్‌పోస్టు వద్దకు వచ్చింది.  కారులో ఉన్న వారు చెన్నై వెళ్లేందుకు అనుమతి కోరారు. ఈ-పాస్‌ లేకుండా వెళ్లడం కుదరదని పోలీసులు తేల్చిచెప్పారు. ఆ తర్వాత అనుమానం వచ్చి కారును తనిఖీ చేయగా.. నాలుగు బ్యాగ్‌ల్లోంచి కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. నాగరాజ్‌ (32), వసంత్‌ (36), డ్రైవర్‌ లక్ష్మీనారాయణ (28)లను అదుపులోకి తీసుకొని చెన్నై ఐటీ అధికారులకు అప్పగించారు.