రైల్వే ఉద్యోగుల వేతనాల నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 38 కోత విధించనుంది. ఈ ఉద్యోగులకు అందించే జాతీయ జెండాల కోసం ఈ మొత్తం కోత విధించనున్నట్టు రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైల్వే ఉద్యోగ సంఘం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు ఇచ్చే జాతీయ జెండాల కోసం కేంద్ర ప్రభుత్వం వారి జీతాల నుంచి రూ. 38 కోత విధించాలని నిర్ణయం జరిగింది. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా రైల్వే ఉద్యోగులకు ఒక్కో జెండా చొప్పున అందిస్తున్నారు. ఆ జెండా కోసం డబ్బును వారి వేతనాల నుంచి కోత కోయనున్నట్టు రైల్వే సీపీఆర్‌వో శివమ్ శర్మ తెలిపారు. అయితే, ఈ నిర్ణయాన్ని రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
జాతీయ జెండాలను రైల్వే ఉద్యోగులకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ అందించనుంది. ఈ జెండా ధరను రూ. 38గా నిర్ణయించారు. రైల్వే ఉద్యోగులు ఈ జెండాను డబ్బులు పెట్టి కొనుగోలు చేయబోరు. కానీ, ఈ డబ్బు మాత్రం వారి వేతనాల్లో కట్ చేసుకుంటారు. నార్త్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించింది.
ఈ జెండాను రైల్వే ఉద్యోగులకు ఎంప్లాయీస్ బెనిఫిట్ ఫండ్ కింద అందిస్తారని, ఆ డబ్బును చివరకు వారి సాలరీల నుంచి ఎంప్లాయీస్ బెనిఫిట్ ఫండ్‌కు బదిలీ చేస్తారని డివిజనల్ మినిస్టర్ చందన్ సింగ్ తెలిపారు. కాబట్టి, ఆ డబ్బును తమ వేతనాల నుంచి కట్ చేయవద్దని కోరారు.
రైల్వే సీపీఆర్‌వో శివమ్ శర్మ ప్రకారం, రైల్వే ఉద్యోగులకు అందించే జాతీయ జెండాల కోసం ఆ ఉద్యోగుల వేతనాల నుంచి రూ. 38 కోత విధిస్తున్నారు. ఈ మేరకు ఓ ఆదేశం కూడా విడుదల అయింది.
ఈ జెండాలు బీజేపీ కార్యాలయాల్లో రూ. 20కు లభిస్తున్నాయి. హెడ్ పోస్టాఫీసుల్లో రూ. 25కు లభిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు వీటిని రూ. 20కే అందిస్తున్నాయి. అయితే, జాతీయ జెండాల కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన భారత్ 75వ స్వాతంత్ర్య దిన ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు.
