రూ. 115 కోట్లు ఫ్రీజ్: ఐటీ శాఖపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్
కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేసింది.ఈ విషయాన్నిఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ తమ బ్యాంకు ఖాతాలను స్థంభింపజేసిందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ న్యూఢిల్లీలో శుక్రవారంనాడు మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలు స్థంభింపజేయబడ్డాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ముగిసిపోయిందని ఆయన విమర్శించారు. యూత్ కాంగ్రెస్ కు చెందిన బ్యాంకు ఖాతాలను స్థంభింపజేసినట్టుగా తెలిసిందన్నారు.
ఈ విషయమై అజయ్ మాకెన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ , కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 210 కోట్ల రికవరీని ఐటీ శాఖ కోరిందని అజయ్ మాకెన్ చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ డబ్బును ఐటీ శాఖ స్థంభింపజేసిందని ఆయన చెప్పారు.
ఎన్నికల ప్రకటనకు కేవలం రెండు వారాల ముందు ప్రతిపక్ష పార్టీ ఖాతాలను స్థంభింపజేస్తే అది ప్రజాస్వామ్యాన్ని స్థంభింపజేయడంతో సమానమన్నారు.ప్రస్తుతం విద్యుత్ బిల్లులు, తమ ఉద్యోగుల జీతాలు కూడ చెల్లించడానికి డబ్బు లేదన్నారు. భారత్ న్యాయ యాత్రతో పాటు తమ పార్టీ కార్యకలాపాలపై కూడ దీని ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. పార్టీ ఇచ్చిన చెక్కులను బ్యాంకులు స్వీకరించడం లేదని గురువారం నాడు తమకు సమాచారం అందిందన్నారు. ఆన్ లైన్ ఫండింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ విరాళాలు సేకరించింది.
ఎలక్టోరల్ బాండ్ రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు నిన్ననే తీర్పును వెల్లడించింది. కాంగ్రెస్ ఖాతాలను ఐటీ శాఖ సీజ్ చేయడంపై ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ విషయమై సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టారు. రాజ్యాంగ విరుద్దంగా బీజేపీ వసూలు చేసిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారు. కానీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా తాము సేకరించిన డబ్బును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.