Asianet News TeluguAsianet News Telugu

జీఎస్టీలో భారీ ఫ్రాడ్! రూ. 1.25 లక్షల కోట్ల మోసం.. కేంద్రం గణాంకాలే చెబుతున్నాయ్: బెంగాల్ మాజీ మంత్రి సంచలనం

భారీ జీఎస్టీ ఫ్రాడ్ జరిగిందని పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా సంచలన ఆరోపణలు చేశారు. రూ. 1.25 లక్షల కోట్ల మోసం జరిగిందని వివరించారు. అధికారిక గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని తెలిపారు. అంతేకాదు, జీఎస్టీ మండలిలో వాతావరణం దారుణంగా దిగజారిపోయిందని ఆరోపించారు.
 

rs 1.25 lakh crore gst fraud, former bengal minister cites centres data
Author
First Published Jan 21, 2023, 8:16 PM IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర దిగ్భ్రాంతికర ఆరోపణలు చేశారు. రూ. 1.25 లక్షల కోట్ల జీఎస్టీ ఫ్రాడ్ జరిగిందని అన్నారు. ఇవి తాను కల్పించి చెబుతున్న లెక్కలు కావని, కేంద్ర ప్రభుత్వ గణాంకాలే వీటిని వెల్లడిస్తున్నాయని వివరించారు. అంతేకాదు, జీఎస్టీ భవిష్యత్‌ అంధకారంగా ఉండే ప్రమాదం ఉన్నదని ఆరోపించారు. ఐదేళ్ల వ్యవధిలోనే జీఎస్టీ మండలిలో వాతావరణం ప్రమాదకరంగా మారిపోయిందని తెలిపారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్‌లో నిర్వహించిన ఓ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.

ప్రస్తుత జీఎస్టీ నిర్మాణం మోసంతో చిక్కుకుని ఉందని అమిత్ మిత్ర అన్నారు. ‘మిస్టర్ నందన్ నిలేకని జీఎస్టీ కౌన్సిల్‌కు ఓ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఆయన ఏం వెతికిపట్టాడు? 2020 వరకు రూ. 70 వేల కోట్ల ఫ్రాడ్‌ను ఆయన కనుగొన్నాడు. ఈ ఫ్రాడ్ మొత్తాన్ని ఆయన రెండుగా విభజించాడు. ఒకటి అధిక ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫ్రాడ్. దీని విలువ రూ. 38,771 కోట్లు. ఎంతమంది ఈ ఫ్రాడ్ చేశారు? వారు ఎలా చేశారు? వారంతా కేవలం కాగితాల మీదనే కంపెనీలు సృష్టించారు. కాగితాల మీదనే లావాదేవీలూ జరిపారు. ఆ తర్వాత వాటికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారు ఎంతమంది? 42,618 కేసులు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లోనే రూ. 38,771 కోట్ల ఫ్రాడ్ జరిగింది. మరో కేటగిరీ కూడా ఉన్నది. అది అండర్ డిక్లరేషన్. ఇది రూ. 31,247 కోట్ల ఫ్రాడ్. కాబట్టి, 2020 నాటికే రూ. 70,018 కోట్ల ఫ్రాడ్‌ను నందన్ నీలేకని అధికారి ప్రెజెంటేషన్‌లో తేలింది. దీనిపై చర్చ జరగలేదు. దీన్ని ఎలా ఆపుతారు?’ అని ఆయన ప్రశ్నించారు.

2020 తర్వాత జరిగిన ఫ్రాడ్‌కు అమిత్ మిత్రా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించిన డేటాను ఆధారంగా తీసుకున్నారు. ‘2020 తర్వాత మరో రూ. 55,575 కోట్ల మోసం బయటపడింది. ఎన్ని కేసులు? 22,300 కేసులు. నేను మీకు కచ్చితమైన డేటా ఇస్తున్నా. అంటే మొత్తం ఫ్రాడ్ ఎంతా? అది రూ. 1,25,593 కోట్లు. రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం, నందన్ నీలేకని ప్రెజెంటేషన్‌లలో వెల్లడైన ఫ్రాడ్ మొత్తం కలిపితే ఇది’ అని తెలిపారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ డిక్లరేషన్స్‌కు సంబంధించినవి మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే ఈ ఫ్రాడ్ మొత్తం రూ. 2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉన్నదని వివరించారు. అయితే, రాష్ట్రాలకు సంబంధించిన అంచనాలేవీ లేవని చెప్పారు.

Also Read: తెలంగాణకు కేంద్రం మద్ధతు లేదు .. టెక్స్‌టైల్ , చేనేత రంగంపై జీఎస్టీ రద్దు చేయాలి : కేటీఆర్

2017లో ఉనికిలోకి వచ్చినప్పుడు జీఎస్టీ కౌన్సిల్ బాగుండేదని, ఇప్పుడు పరిస్థితులు దారుణంగా దిగజారాయని అన్నారు. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు జీఎస్టీ మండలిలో అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునేవారని, నిర్ణయాలు సామూహిక ఏకాభిప్రాయంతో జరిగేవని వివరించారు. కానీ, ఇప్పుడు ఇది మెజార్టీ నిర్ణయానికే కుదించబడిందని తెలిపారు.

మన దేశంలో జీఎస్టీ మండలి వంటి సంస్థ ఏదీ లేదని, ఇది స్పష్టమైన సమాఖ్య సంస్థ అని వివరించారు. తొలి మూడు సంవత్సరాల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకునేవారని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారని చెప్పారు.

ఇప్పుడు జీఎస్టీ మండలి స్వయంగా చాలా ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ రూల్ 6 ప్రకారం ప్రతి మూడు నెలలకు మండలి సమావేశమవ్వాలని, కానీ, వారు భేటీ కావడం లేదని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios