Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు కేంద్రం మద్ధతు లేదు .. టెక్స్‌టైల్ , చేనేత రంగంపై జీఎస్టీ రద్దు చేయాలి : కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. టెక్స్‌టైల్ , చేనేత రంగంపై జీఎస్టీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు కేంద్రం మద్ధతు లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. 

minister ktr fires on center over gst on textile industry
Author
First Published Dec 28, 2022, 9:36 PM IST

టెక్స్‌టైల్, నేతన్నల పరిస్ధితులపై మోడీ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల ప్రగతికి కేంద్రం సహకరించడం లేదన్నారు. తెలంగాణ టెక్స్‌టైల్ రంగానికి ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలతో భారతదేశం పోటీ పడలేని స్థితికి కేంద్రం విధానాలే కారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్ధతు కోరితే కేంద్రం సహకారం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఎంతమంది ఆర్ధిక మంత్రులు మారినా, తెలంగాణకు అందుతున్నది శూన్యమేనని కేటీఆర్ పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌కి నిధులివ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ .. టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. టెక్స్‌టైల్ , చేనేత రంగంపై జీఎస్టీని రద్దు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ALso REad: ఫాంహౌస్ ఫైల్స్ ఫెయిలా... దొరికిన ఆడియో, వీడియోలు అబద్ధమా : కిషన్ రెడ్డికి తలసాని కౌంటర్

ఇకపోతే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్ట్‌లకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు  కేసులో దొంగల ముసుగులు తొలగాయన్నారు. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సంబంధం లేదన్నవారే దొంగలను భుజాలపై మోస్తున్నారని మంత్రి ఆరోపించారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్ రెడ్డికి సంబరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబరాలు చేసుకోవడం వెనుక మర్మమేంటని ఆయన నిలదీశారు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటికొస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారని.. నేరం చేసినవాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోలేరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టిలో మరల్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు ఆడటం , కొత్త కథలు చెప్పడం , కొత్త కొత్త నటులతో కొత్త సినిమాలు తీయడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు . పాలనను గాలికొదిలేసి, తన అస్ధిత్వాన్ని కాపాడుకునేందుకు ఇతరుల మీద బురద జల్లడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. రాష్ట్రంలో అనేక సందర్భాలలో , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన న్యాయస్థానాలు సుమోటాగా తీసుకుని మొట్టికాయలు కొట్టిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చివరికి రాష్ట్రంలో ప్రజలు తమ నిరసన తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఇందిరా పార్క్ దగ్గర  ధర్నాలు చేయరాదని బీఆర్ఎస్ ప్రభుత్వం హుకుం జారీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు మండిపడిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios