తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువకుడు ఎయిర్ హోస్టెస్ చెవి కోసేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కాగా.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా... పోలీసులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌ అజయ్‌ అలియాస్‌ జాకీ.. గత కొంతకాలంగా..  ఇండిగో ఎయిర్ లైన్స్ లో పనిచేసే ఎయిర్ హోస్టెస్ ని ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలంటూ ఆమె వెంటపడుతున్నాడు. దీంతో...అతని వేధింపులు తట్టుకోలేక ఆ ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో... ఆమెపై పగ పెంచుకున్నాడు. తన ప్రేమను అంగీకరించకపోగా.. పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపం పెంచుకున్నాడు.

ఈ నెల 12 తేదీన ఎయిర్‌హోస్టెస్‌ కెంపేగౌడ విమానాశ్రయానికి క్యాబ్‌లో వెళుతుండగా.. ఆమె వాహనాన్ని జాకీ వెంబడించాడు. వాహనాన్ని దారిలో అడ్డుకొని.. తనపై పోలీస్ స్టేషన్ లో పెట్టిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు.

ఆమె అందుకు అంగీకరించకపోవడంతో.. కత్తితో చెవిని కోసి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.