ట్రైన్‌లో ఘరానా చోరీ.. రైలు కదలగానే గన్‌లు తీసి బెదిరింపులు, కాల్పులు.. లూటీ చేసి చైన్ లాగి పరార్

జార్ఖండ్‌లో ఘరానా చోరీ జరిగింది. లతేహార్ రైల్వే స్టేషన్‌లో స్లీపర్ కోచ్‌లో పది మంది సాయుధులు ఎక్కారు. ఆ తర్వాత తమ వద్ద తెచ్చుకున్న ఆయుధాలను తీసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. ఆ తర్వాత వారి వద్ద నుంచి నగదు, నగలు, మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. చైన్ లాగి ట్రైన్ ఆగిన తర్వాత దిగి ఆ ముఠా పారిపోయింది.
 

robbers with weapons threaten train passengers, after robbery pull train chain and run kms

న్యూఢిల్లీ: ట్రైన్‌లో ఘరానా చోరీ చోటుచేసుకుంది. ట్రైన్ కదలగానే దోపిడీ ముఠా గన్‌లు బయటకు తీసింది. గాల్లోకి కాల్పులు జరిపి బెదిరించింది. ప్రతిఘటించిన కొందరిని చితకబాదింది. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి నగదు, నగలు, మొబైల్ ఫోన్లు లాక్కుంది. కొద్ది దూరం తర్వాత చైన్ లాగింది. ట్రైన్ ఆగాక దిగి ఆ ముఠా పారిపోయింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి జమ్మూకు వెళ్లుతున్న ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి 11.30 గంటల తర్వాత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

లతేహార్ రైల్వే స్టేషన్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ శనివారం రాత్రి 11.22 గంటలకు ఆగింది. ఆ తర్వాత పది మంది సాయుధులు ఎస్ 9 బోగీలోకి ఎక్కారు. ఆ తర్వాత నెమ్మదిగా ట్రైన్ మూవ్ అయింది. ట్రైన్ వేగం అందుకోగానే దొంగలు రెచ్చిపోయారు. తమ వద్ద ఉన్న ఆయుధాలు తీసి గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన కొందరిని ఆ ముఠా కొట్టింది. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు, డబ్బులు, మొబైల్ ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. అనంతరం, చైన్ లాగి ట్రైన్ దిగి వెళ్లిపోయారు.

లతేహార్ నుంచి ట్రైన్ ప్రయాణం ప్రారంభమైన తర్వాత బర్వాడీ స్టేషన్ చేరుకోకముందే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తూర్పు మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 

Also Read: 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. కాచిగూడ యశ్వంత్‌పూర్ రైలుకు జెండా ఊపిన కిషన్ రెడ్డి

ఈ దోపిడీ ముఠా దాడిలో గాయపడ్డ ఐదారుగురికి డాల్టన్ గంజ్ స్టేషన్‌లో చికిత్స అందించినట్టు ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. మరికొందరు ప్రయాణికులకు వైద్యులను రైలుకు రప్పించి ట్రీట్‌మెంట్ అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios