New Delhi: బిపర్జోయ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో సహా వివిధ కారణాల వల్ల రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. ఆకాల వ‌ర్షాలతో పంట‌లు దెబ్బ‌తిన‌డంతో పాటు రుతుపవనాల సీజన్ ప్రారంభం కావడం, పంట దిగుబ‌డులు త‌గ్గ‌డంతో ట‌మాటా ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లోనూ ట‌మాటా ధ‌ర‌లు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి.   

Tomato price rise: దేశవ్యాప్తంగా ఒక్క నెలలోనే టమాటా ధరలు రెట్టింపు కావడంతో.. ఇత‌ర కూర‌గాయ‌లు సైతం ఇదే దారిలో ప‌య‌నిస్తుండ‌టంపై విపక్షాలు కేంద్రం విధానాలను తప్పుబట్టాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధరల పర్యవేక్షణ విభాగం ప్రకారం, మంగళవారం కిలో టమోటా సగటు జాతీయ ధర హోల్ సెల్ రూ.46.1 వుండ‌గా, నెల క్రితం రేటు రూ.23.61గా ఉంది. వర్షాల జాప్యమే ఈ పెరుగుదలకు కారణమనీ, త్వరలోనే తగ్గింపున‌కు సంబంధించిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్రం తెలిపింది. అయితే, చాలా రాష్ట్రాల్లో ట‌మాటో ధ‌ర కేజీ రూ.80 వ‌ర‌కు ప‌లుకుతోంది. మంచి ప్రెష్ ట‌మాటో అయితే కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.100 వ‌ర‌కు చేరుకుంది. 

ధరల పెరుగుదలకు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. "టమాటా, ఉల్లి, బంగాళాదుంపలను ప్రధాని 'టాప్' ప్రాధాన్యతగా అభివర్ణించారు. కానీ ఆయన తప్పుడు విధానాల కారణంగా... మొదట టమోటాలను రోడ్డుపై విసిరేస్తారు, తరువాత కిలోకు 100 రూపాయలకు అమ్ముతారు! పప్పుధాన్యాలు మాయమయ్యాయి. పిండి మాయమైంది.. నూనె మాయమైంది. పేదల ప్లేట్ నుంచి కూరగాయలు కూడా మాయమయ్యాయని" మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా అన్నారు. "మోడీజీ, మీరు విదేశాల్లో ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ ద్రవ్యోల్బణం మీ నియంత్రణలోకి రావడం లేదు. నిర్మల గారూ, ఉల్లిపాయల తర్వాత మనం కూడా టమోటాలు తినడం మానేయాలా?.." అని ప్ర‌శ్నించారు.

ఢిల్లీ, ముంబ‌యి, కోల్ క‌తా, చెన్నై వంటి నగరాల్లో కిలో టమోటా ధర వరుసగా రూ.60, రూ.42, రూ.75, రూ.67గా ఉందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది తాత్కాలిక అంశమని మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. "ఇది త్వ‌ర‌గా పాడైపోయే వస్తువు. అకస్మాత్తుగా వర్షం కురిసిన ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఇది తాత్కాలిక సమస్య. త్వరలోనే ధరలు తగ్గనున్నాయి. ఇది ప్రతి సంవత్సరం ఈ సమయంలో ఇలా జరుగుతుంది" అని సింగ్ పీటీఐకి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ట‌మోటా ధ‌ర‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కీలో ట‌మాటా ధ‌ర రూ.80 నుంచి 100 రూపాయ‌ల‌కు వ‌ర‌కు ప‌లుకుతోంది. 

దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ ట‌మాటాతో పాటు ఇత‌ర కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్క‌డికి జ‌రిగే స‌ర‌ఫ‌రా గురించి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. టమాటాకు సీజనల్ ఉందనీ, గత ఐదేళ్ల టమోటా ధరల గణాంకాలు ఈ సమయంలో ప్రతి సంవత్సరం రేట్లు పెరిగాయని తెలియజేస్తున్నాయని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి మరో 10 రోజుల్లో సరఫరా ప్రారంభమవుతుందనీ, ధరలు తగ్గుతాయని చెప్పారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్వహించే డేటా ప్రకారం, జూన్ 27 న అఖిల భారత ప్రాతిపదికన టమాటా సగటు ధర కిలోకు రూ.46. మోడల్ ధర కిలోకు రూ.50, గరిష్ట ధర కిలోకు రూ.122గా ఉంది.

ఇతర ప్రధాన నగరాల్లో బెంగళూరులో కిలో రూ.52, జమ్మూలో కిలో రూ.80, లక్నోలో రూ.60, సిమ్లాలో కిలో రూ.88, భువనేశ్వర్ లో రూ.100, రాయ్పూర్ లో రూ.99, హైద‌రాబాద్ లో రూ. 95, గోరఖ్ పూర్ (ఉత్తరప్రదేశ్), బళ్లారి (కర్ణాటక)లలో కిలో రూ.122 గరిష్ట ధర పలుకుతోంది.