దేశవ్యాప్తంగా డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో దాని ధర మండిపోతోంది. కొద్దిరోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.100 వుండగా.. అది రూ.140 పలుకుతోంది.. అయితే త్వరలో 180కి చేరే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు.  

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత కీలకమైన కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో పలు చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. వున్న కొద్దిపాటి నిల్వలను వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. 

కొద్దిరోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.100 వుండగా.. అది రూ.140 పలుకుతోంది.. అయితే త్వరలో 180కి చేరే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే వచ్చేది వర్షాకాలం కావడంతో దేశంలో మళ్లీ ఉత్పత్తి పెరిగే అవకాశం వుందని చెబుతున్నారు. మనదేశంలో గతేడాది 43.4 లక్షల టన్నుల కందిపప్పును పండించగా.. దీనికి అదనంగా మరో 15 లక్షల టన్నులను బయటిదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది దిగుబడి 38.9 లక్షల టన్నులను మించలేదు. అటు ఇతర దేశాల నుంచి కందిపప్పును దిగుమతి చేసుకునేందుకు కేంద్రం కూడా చర్యలు చేపట్టకపోవడంతో ధరలు మండిపోతున్నాయి. 

ఇకపోతే.. కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. దీనిని తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. అలాగే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ పప్పులో సోడియం, ఫైబర్, కార్భోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పును రోజూ తింటే మీ బీపీ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కందిపప్పులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించేందుకు సహాయపడుతుంది. ఎవరైనా రక్తపోటుతో ఇబ్బందిపడుతున్నట్టైతే.. వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి వారు బీపీని కంట్రోల్ లో ఉంచేందుకు కందిపప్పును తినాలి.