కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ ప్రభుత్వం ససారాంలో అల్లర్లు జరగకుండా చూసుకోలేకపోయిందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడినవారిని తలకిందులుగా వేలాడదీస్తామని తెలిపారు. 

పాట్నా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం బిహార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహఆర్‌లోని సాసరామ్, షరీఫ్ టౌన్‌లో అల్లర్లు జరగకుండా అడ్డుకోవడంతో విఫలమైందని అన్నారు. 2025లో బిహార్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అల్లర్లకు పాల్పడినవారిని తలక్రిందులుగా వేలాడదీస్తామని తెలిపారు.

నవాడా జిల్లాలోని హిసువాలో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 40 స్థానాల్లో గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్దారించుకున్నారని అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని మూడోసారి గెలిపించాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని వివరించారు. అది జరిగితే నితీశ్ కుమార్, ఆయన తేజస్వీ యాదవ్‌ల కలలు కల్లలవుతాయని తెలిపారు.

లాలు ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లు సంతుష్టికర రాజకీయాలు చేశారని అన్నారు. తద్వార టెర్రరిజం చెలరేగిందని ఆరోపించారు. అదే నరేంద్ర మోడీ జమ్ము కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేశారని చెప్పారు. 

Also Read: ఏప్రిల్ 8న తెలంగాణకు ప్రధాని .. వందే భారత్ రైలు సహా అభివృద్ధి కార్యకమాలను ప్రారంభించనున్న మోడీ

నితీశ్ కుమార్‌తో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో చేతులు కలుపదని స్పష్టం చేశారు. కుల విషాన్ని విరజిమ్మే నితీశ్ కుమార్‌తో... జంగల్ రాజ్‌కు ఆద్యుడు లాలు ప్రసాద్‌తో బీజేపీ చేతులు కలుపదని తెలిపారు. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీలు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించారని వివరించారు. కానీ, ఒక శుభోదయాన నరేంద్ర మోడీ ఆకాశమంతా ఎత్తైన రామ మందిర ఆలయానికి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.