Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ 8న తెలంగాణకు ప్రధాని .. వందే భారత్ రైలు సహా అభివృద్ధి కార్యకమాలను ప్రారంభించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. 

PM Narendra Modi to visit Hyderabad on April 8th ksp
Author
First Published Apr 1, 2023, 8:24 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆ రోజున హైదరాబాద్‌లో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును కూడా మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టనున్న రెండో వందే భారత్ రైలు ఇదే.

ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్- ఆధ్యాత్మిక నగరం తిరుపతి మధ్య ప్రయాణించే వారికి ఈ రైలు అతుకులు లేని సేవలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ రైలును తెలుగు ప్రజలకు అందించినందుకు గాను ప్రధాని మోడీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్-తిరుపతి మధ్య ఎన్నో రైళ్లు నడుస్తుండగా.. అవి గమ్యస్థానం చేరేందుకు దాదాపు 11 గంటలకు పైనే సమయం తీసుకుంటోంది. అయితే కొత్తగా ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది గంటల్లోపే ప్రయాణాన్ని పూర్తి చేయనుంది. 

కాగా.. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ, గుంటూరు, నెల్లూరుల మీదుగా తిరుపతి చేరనుంది. సంక్రాంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల మధ్య.. తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వందే భారత్  ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య నడుస్తోంది. ఈ రైలుకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్-తిరుపతిల మధ్య కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంచి ఆదరణ పొందుతుందని రైల్వే వర్గాలు విశ్వసిస్తున్నాయి.

నిత్యం వేల సంఖ్యలో హైదరాబాదు నుంచి తిరుపతికి భక్తులు ప్రయాణిస్తుంటారు. తిరుపతి వెళ్లాలనుకునేవారికి నాలుగైదు వారాల ముందు ప్రయత్నిస్తే తప్ప ఈ రైళ్లలో టికెట్లు రిజర్వేషన్ దొరకదు. ప్రయాణికుల నుంచి ఉన్న ఈ భారీ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి…. కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు,  మహబూబ్‌నగర్ - కర్నూలు, వికారాబాద్ - తాండూరు-రాయచూరు..  లాంటి నాలుగు మార్గాల్లో ప్రస్తుతం రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. 

ఇక.. సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ప్రవేశపెట్టబోతున్న వందే భారత ఎక్స్‌ప్రెస్ చార్జీలు ఎలా ఉండబోతున్నాయి? ప్రయాణ సమయం ఎంతసేపు ఉంటుంది..  అనేదాని మీద స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios