రాజ్యసభలో అత్యధిక ఆస్తులున్న ఎంపీలుగా బీఆర్ఎస్ కు చెందిన బండి పార్థసారధి రెడ్డి, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
ఢిల్లీ : రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపి, బీఆర్ఎస్ సభ్యులు నిలిచారు. జాతీయ పార్టీల సభ్యుల కంటే వీరు అత్యధిక ఆస్తి విలువలు కలిగి ఉన్నారు. వీరిలో బండి పార్థసారధి రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలు.. రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ఆస్తులు ఉన్న ఎంపీలుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
వీరిలో బండి పార్థసారధి రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ కాగా, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ఎంపీ. ఇక వీరి ఆస్తుల విలువకు వస్తే.. పార్థసారధి రెడ్డికి రూ.5300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయోధ్య రామిరెడ్డికి రూ.2577 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
రాజ్యసభలోని మొత్తం 225 మంది సభ్యుల ఆస్తుల విలువ రూ.18,210 కోట్లు. అందులో ఈ ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల సంపద 43.25 శాతం ఉంది. వైసీపీ, బీఆర్ఎస్ లకు చెందిన 16 మంది ఎంపీల ఆస్తుల విలువలో… వీరి వాటా ఏకంగా 86.02 శాతం ఉంది.
మనుషుల్ని నగ్నంగా చూడొచ్చని... మ్యాజిక్ మిర్రర్ పేరుతో వృద్ధుడికి టోకరా..
వీరిద్దరి తర్వాతి స్థానాల్లో సమాజ్వాది పార్టీ ఎంపీ, అమితాబచ్చన్ భార్య జయభచ్చన్ రూ.1001 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 233మంది సభ్యుల్లో 225 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) సంస్థ పరిశీలించింది, వీరిపరిశీలన ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి.
రాజ్యసభలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న బిజెపి (85), కాంగ్రెస్ (30)లకు చెందిన 115 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.4,128 కోట్లు అయితే.. బీఆర్ఎస్ (7), వైసిపి (9)లకు చెందిన 16 మంది సభ్యుల ఆస్తి విలువ రూ. 9,157 కోట్లుగా ఉంది. శుక్రవారం నాడు ఏడిఆర్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.
రాజ్యసభలోని సభ్యుల పార్టీల వారీగా ఆస్తుల విలువను చూస్తే.. టిఆర్ఎస్ సభ్యుల మొత్తం ఆర్సి విలువ రూ.5,596 కోట్లు.. కాగా, వైసిపి ఎంపీల ఆస్తుల విలువ రూ.3,561 కోట్లు, బిజెపి సభ్యులకు వచ్చేసరికి ఇది రూ.2,579కోట్లు.. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు రూ.1,549 కోట్లు, కాంగ్రెస్ తర్వాతి స్థానంలో ఆప్ సభ్యులు రూ.1,316 కోట్లతో నిలిచారు. ఇక సమాజ్ వాదీ పార్టీ సభ్యులు రూ.1,019 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.
ఈ ఆస్తుల విలువలో రాష్ట్రాల వారీగా చూస్తే… తెలంగాణ రూ, 5596 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రూ. 3823 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తర ప్రదేశ్ రూ. 1941 కోట్లు, పంజాబ్ రూ. 1136 కోట్లు, మహారాష్ట్ర రూ. 1070 కోట్లుగా ఉన్నాయి.
బిలియనీర్లు వీరే...
ఇక ఎంపీల్లో బిలియనీర్ల సంఖ్యకు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 45%, తెలంగాణ ఎంపీల్లో 43%, ఢిల్లీ ఎంపీల్లో 33%, పంజాబ్ ఎంపీల్లో 23 శాతం మంది బిలియనీర్లు ఉన్నారు.
రాజ్యసభలోని మొత్తం 225 మంది సభ్యుల్లో 12 శాతం మంది అంటే 27 మంది ఎంపీలు అపర కోటీశ్వరులున్నారు. ఈ బిలియనీర్లలో బిజెపికి చెందినవారు ఆరుగురు ఉండగా కాంగ్రెస్ కు చెందినవారు నలుగురు, వైసీపీ ఎంపీలు నలుగురు, ఆఫ్ ఎంపీలు ముగ్గురు, బీఆర్ఎస్ ఎంపీలు ముగ్గురు, ఆర్జెడి ఎంపీలు ఇద్దరు ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరు 100కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు.
అప్పూలూ ఘనమే...
ఇక అప్పుల్లోనూ తెలుగువారే డంకా భజాయించారు. వైసీపీ సభ్యులు అత్యధిక అప్పులున్న ఎంపీల్లోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మొదటి స్థానంలో పరిమళ్ నత్వానీకి రూ. 209 కోట్లు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి రూ.154 కోట్ల అప్పులు ఉన్నాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం చూపిన ఎంపీల్లో తొలి మూడు స్థానాల్లో.. రెండు స్థానాల్లోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలే ఉన్నారు. మొదటి స్థానంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రూ. 279 కోట్లు… రూ. 140 కోట్లతో బండి పార్థసారధి రెడ్డి, రూ 131 కోట్లతో అభిషేక్ మను సింఘ్వీ మూడో స్థానంలో ఉన్నారు.
నేర చరిత్రలోనూ..
ఆస్తులు, అప్పులే కాకుండా.. ఎంపీల నేర చరిత్రను కూడా ఈ నివేదిక బయటపెట్టింది. దీంట్లో రాజ్యసభలోని మొత్తం 225 మంది ఎంపీలు 75% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా తేలింది. అందులోనూ 41 మందిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. ఐపిసి 302 సెక్షన్ కింద ఇద్దరు ఎంపీల మీద హత్య కేసులు కూడా ఉన్నాయి.
మరో నలుగురు రాజ్యసభ సభ్యులపై ఐపిసి 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మహిళలపై నేరాలకు పాల్పడినట్లుగా మరో నలుగురు ఎంపీలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నేరచరిత్ర ఉన్న ఎంపీల్లో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కూడా ఉన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 376 కింద అత్యాచార కేసు ఉంది.
