ఐదేళ్ల క్రితం తన ప్రేయసికి జరిగిన అవమానానికి ఓ యువకుడు పగ తీర్చుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడుకు చెందిన 24ఏళ్ల తమిళసెల్వన్ కన్నన్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం అతని ప్రేయసిని కొందరు వ్యక్తులు అసభ్యకరంగా చిత్రీకరించారు. అనందరం సైబర్ వేధింపులకు గురిచేశారు. కాగా.. తన ప్రేయసిని వేధించిన వారిని ఐదేళ్ల తర్వాత సెల్వన్ పగ తీర్చుకోవడం విశేషం.

నిందితుడు తన ప్రతీకారం తీర్చుకునేందుకు విభిన్న రీతిని ఎంచుకొని, దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్ధుల ల్యాప్‌టాప్‌లను టార్గెట్‌ చేశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ పోలీసులు ఓ ల్యాప్‌టాప్ దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


ప్రతీకారేచ్ఛలో భాగంగా నిందితుడు ఇప్పటివరకు 500 మంది మెడికోల ల్యాప్‌టాప్‌లు దొంగిలించానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చోరీలకు పాల్పడేందుకు నిందితుడు ఇంటర్నెట్‌లో మెడికల్‌ కాలేజీల సమాచారం సేకరించి, ఆ తరువాత రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. తాను చోరి చేసిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువ శాతం దక్షిణ భారత దేశంలోని మెడికల్‌ కళాశాలకు చెందిన విద్యార్ధులవిగా పేర్కొన్నాడు. నిందితుడు చివరిగా గతేడాది డిసెంబర్‌లో జామ్ నగర్‌లోని ఎంపి షా మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.