Asianet News TeluguAsianet News Telugu

రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు..

దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.

Republic Day 2023 PM Modi pays homage to martyrs at National War Memorial
Author
First Published Jan 26, 2023, 10:52 AM IST

దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. దేశాన్ని రక్షించడంలో సాయుధ సిబ్బంది చేసిన అత్యున్నత త్యాగాలకు నివాళులర్పిస్తూ ప్రధాని మోదీ రెండు నిమిషాల మౌనం పాటించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. స్మారక చిహ్నం వద్ద సందర్శకుల పుస్తకంపై సంతకం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, త్రివిధ దళాధిపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వారంతా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించనున్న కర్తవ్యపథ్‌కు చేరుకన్నారు. 

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరి కర్తవ్య పథ్ వద్ద జరిగే గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్‌ ఎల్‌ సిసి కూడా రాష్ట్రపతి భవన్‌ నుంచి కర్తవ్య‌పథ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. 

Also Read: స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలి.. ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

రాజ్‍పథ్‍ను సర్వాంగ సుందరంగా ఆధునీకరించి గతేడాది కర్తవ్యపథ్‍గా మార్చిన సంగతి తెలిసిందే. కర్తవ్యపథ్‌‌లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. దేశంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తి, 'న్యూ ఇండియా' ఆవిర్భావాన్ని వర్ణించేలా పరేడ్ ఉండనుంది. సైనిక పరాక్రమం, సాంస్కృతిక వైవిధ్యం కనిపించేలా అద్వితీయ మిశ్రమంగా పరేడ్ సాగనుంది. పరేడ్‌లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి శకటాల ప్రదర్శన పరేడ్‍లో ఉంటుంది. వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి కొన్ని శకటాలను ప్రదర్శించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios