స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలి.. ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవం వేళ మనం జరుపుకుంటున్నందున ఈ సారి గణతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుందామని అన్నారు. తోటి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఇక, దేశ ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలియజేశారు. ‘‘దేశప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.ఈ రోజు.. దేశాన్ని విముక్తి చేయడానికి, బలోపేతం చేయడానికి, రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు, వీర సైనికులందరికీ నేను నమస్కరిస్తున్నాను’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
ఇక, దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభం కానుంది. దేశంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తి, 'న్యూ ఇండియా' ఆవిర్భావాన్ని వర్ణించేలా పరేడ్ ఉండనుంది. సైనిక పరాక్రమం, సాంస్కృతిక వైవిధ్యం కనిపించేలా అద్వితీయ మిశ్రమంగా పరేడ్ సాగనుంది. రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించడంతో పరేడ్ ప్రారంభమవుతుంది.
ఇక, పరేడ్ కు ముందే ఢిల్లీలోని చాలా ప్రాంతాలను కంటోన్మెంట్ లుగా మార్చారు. ముఖ్యంగా పరేడ్ రూట్లలో 7 వేల మందికి పైగా సైనికులను మోహరించారు. దీంతో పాటు ఎన్ఎస్జీ బృందాలను రంగంలోకి దింపారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)తో పాటు మొబైల్ క్యూఆర్టీని కూడా రంగంలోకి దించనున్నారు. ఈసారి డ్రోన్ల నుంచి దాడి చేసే అవకాశం ఉన్న దృష్ట్యా యాంటీ డ్రోన్ స్క్వాడ్లను మోహరించారు. అలాగే అనుమానాస్పద ముఖాలను గుర్తించే కెమెరాలను ఏర్పాటు చేశారు.