Asianet News TeluguAsianet News Telugu

‘‘భార్యల బజార్’’.. ఎవరి భార్య నచ్చితే వాళ్లని అద్దెకు తెచ్చుకోవచ్చు

మనదేశంలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు స్త్రీని అంగడి వస్తువుగా, ఒక విలాస వస్తువుగా భావిస్తూ వస్తోంది సమాజం. నాటికి నేటికి ఈ సమాజంలో ఎలాంటి మార్పు రాకపోగా.. ఈ జాడ్యం మరింత పెచ్చుమీరుతోంది

rent for wife in Madhya Pradesh

మనదేశంలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు స్త్రీని అంగడి వస్తువుగా, ఒక విలాస వస్తువుగా భావిస్తూ వస్తోంది సమాజం. నాటికి నేటికి ఈ సమాజంలో ఎలాంటి మార్పు రాకపోగా.. ఈ జాడ్యం మరింత పెచ్చుమీరుతోంది. ఇప్పటికే వ్యభిచార గృహాల్లో అంగట్లో సరకుగా స్త్రీ మారిపోయింది. ఎన్నో ముఠాలు అమ్మాయిలను విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నారు. ఇక అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసిన భార్యను అద్దెకిస్తున్న సంగతి తెలుసా.

గదులను, కార్లను, బైకులను అద్దెకిచ్చినట్లు.. కాంట్రాక్ట్ పద్దతి మీద భార్యలను అద్దెకిస్తూ వందల ఏళ్లుగా సాగుతున్న వింత సంప్రదాయానికి వేదిక మధ్యప్రదేశ్‌. ఈ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో గ్వాలియర్ రాచరికానికి, రాజపుత్రులకు, సంప్రదాయాలకు, కట్టుబాట్లకు పెట్టింది పేరు. ఇక్కడ భర్తకు డబ్బులు ఇచ్చి నచ్చిన వ్యక్తి భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు. తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం పేరు ‘‘దడీచ ప్రథ’’. షోరూమ్స్‌లో బొమ్మల్ని నిలబెట్టినట్లు.. ఈ భార్యల మార్కెట్లో మహిళలను వరుసలో నిలబెట్టి మరీ అద్దెకిస్తారు.

ఇంత బహిరంగంగా ఇలాంటి ఘోరం జరుగుతుంటే ప్రభుత్వం కానీ, అధికారులు కానీ పట్టించుకోరా అని మీకు అనుమానం రావొచ్చు. కానీ ఇక్కడ అలాంటి పప్పులు ఉడకవు.. ఈ వ్యవహారానికి పూర్తి చట్టబద్ధత కూడా ఉంది. 10 రూపాయల రెవెన్యూ స్టాంప్ పేపర్ల మీద ఒప్పందానికి రక్షణ కల్పిస్తారు. అద్దె సమయంలో ఆ స్త్రీకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే.. ఆమెకు ఏమైనా జరిగితే దానికి పూర్తిగా అద్దెకు తీసుకున్న వ్యక్తి బాధ్యత వహించాలి.

అయితే ఇది కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం. మహిళ అనారోగ్యంతో ఉంటే ఆ స్త్రీని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. ఇక్కడ మరో షరతు ఉంది..అద్దెకు భార్యను తీసుకువెళ్లే వ్యక్తికి భార్య ఉండకూడదు. అంటే పెళ్లై ఉండకూడదు. కానీ భార్యలు ఉన్నవారు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి అద్దెకు భార్యలను కొనుక్కొంటారు.

అద్దెకు వెళుతున్న స్త్రీల మనోభావాలు ఇక్కడ పరిగణనలోనికి రావు.. మంచి బేరం కుదిరితే భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడి వెంట పంపించేస్తారు. అందంగా ఉన్న మహిళలకు అద్దె ఎక్కువ పలుకుతుంది. నెల నెలా అద్దె నుంచి సంవత్సరం మొత్తానికి అద్దె చెల్లించే పద్ధతి ఇక్కడ ఉంది.. లక్ష రూపాయల నుంచి అత్యధికంగా రూ.20 లక్షల వరకు వుంటుంది. ఈ సమయంలో స్త్రీలు గర్భం దాల్చినా.. అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు.

దేశం మొత్తం మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఇక్కడి స్త్రీలు తమ భవిష్యత్తు గురించి పోరాడారా అంటే.. గ్వాలియర్ ప్రాంతంలో భర్తలకు భార్యల మీద పూర్తి హక్కులుంటాయని తరతరాలుగా ఇక్కడి సమాజం నమ్ముతూ వస్తోంది. వివాహం జరిగిన తర్వాత ఆ స్త్రీని భర్త ఏం చేసినా నోరు విప్పరు ఇక్కడి మహిళలు.. తమ సమాజ కట్టుబాట్లను ఉల్లంఘించడానికి గ్వాలియర్ మహిళలు ఇష్టపడరు. వీరి జోలికి వెళ్లడానికి పోలీసులు సైతం సాహసించరు.

ఇప్పుడిప్పుడే కొందరు స్త్రీలు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నా.. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. కట్టుబాట్లతో పాటు పేదరికం కూడా ఇక్కడి స్త్రీలు ‘‘దడీచ ప్రథ’’ వైపు మొగ్గుచూపుతున్నారు. జానెడు పొట్ట నింపుకోవడానికి భర్తలు కూడా మనసు చంపుకుని భార్యలను అద్దెకిస్తున్నారు. దీనిలో కీలకపాత్ర పోషించేది దళారులే.. పేదరికంలో మగ్గిపోతున్న కొన్ని కుటుంబాల దగ్గరకు వెళ్లి వారికి డబ్బు ఆశచూపుతారు.

వీరి మాటలను నమ్మిన భర్తలు తమ భార్యలను అద్దెకు పంపడానికి సిద్ధమైపోతారు. ఇంత చేస్తే ఎక్కువ భాగం దళారుల జేబుల్లోకే వెళ్లిపోతుంది... బాధితులకు ముట్టేది మాత్రం పది నుంచి పదిహేను వేలు మాత్రమే. పేదరికం సృష్టించే అనేక వీపరీతాలలో ఇలాంటి వింత ఆచారం ఒకటని నిపుణులు అంటున్నారు. ఈ తరహా దురాచారాలను రూపుమాపి మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని సామాజిక వేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios