ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని ఓ గ్రామానికి చెందిన బాలిక అనారోగ్యానికి గురైంది. ఆ గ్రామానికి ఎలాంటి వాహనాలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమెను బంధువులు ఓ చెక్క బల్లపై పడుకోబెట్టి 25 కిలో మీటర్లు దూరంలో ఉన్న మహారాష్ట్రలోని ఓ పీహెచ్ సీకి తీసుకొని వచ్చారు.
ప్రజలకు మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా కష్టపడుతున్నా.. వాటి ఫలాలు మారుమూల పల్లెలలకు అందటం లేదు. ఇంకా అనేక మందికి వైద్యం చేరడం లేదని చెప్పడానికి తాజాగా జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఓ గిరిజన యువతికి వైద్యం అందించడానికి ఆమె బంధువులు ముప్పు తిప్పలు పడ్డారు. ఆమెను ఓ చెక్క బల్లపై పడుకోబెట్టి, భుజాలపై మోస్తూ 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఉన్న అనేక గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఉన్నాయి. ఈ జిల్లాలోని మెట్వాడ గ్రామంలో వైద్య సదుపాయాలు లేవు. ఈ ప్రాంతంలో గిరిజనులు అధికంగా నివసిస్తారు. అయితే ఆ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అనారోగ్యానికి గురైంది. ఆ చుట్టుపక్కల ఉండే గిరిజన గ్రామాలు కొండ ప్రాంతాల్లో ఉండటం వల్ల వాహనాలు కూడా అక్కడి చేరవు. దీంతో చేసేదేమీ లేక బంధువులు ఎలాగోలా బాలికను ఎలాగోలా హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సంకల్పించారు.
వారివద్ద అందుబాటులో ఉన్న చెక్కలతో బల్లను తయారు చేసి, దానిపై బాలికను పడుకోబెట్టారు. దానికి తాళ్ల సాయంతో కర్రలకు కట్టి, వాటిని భుజాన వేసుకొని నడక ప్రారంభించారు. ఆ కొండ ప్రాంతాల నుంచి సుమారు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భుమ్రాగఢ్ తాలూకాలోని లాహేరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శుక్రవారం తీసుకొచ్చారు.
అక్కడి డాక్టర్లు బాలికకు వెంటనే వైద్యం మొదలుపెట్టారు. దీంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కాగా.. ఆ బాలికను చెక్కబల్లపై పడుకోబెట్టి హాస్పిటల్ కు తీసుకొచ్చిన దృష్యాలను పలువురు ఫొటోలు, వీడియోలు తీశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
