ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లిలో హల్ చల్ జరిగింది. పనీర్ కూర పెట్టలేదని వరుడి బంధువులు గొడవకు దిగడంతో వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
ఉత్తర ప్రదేశ్ : పెళ్లిళ్లలో గొడవలు జరగడం మామూలు విషయమే. ముఖ్యంగా మగపెళ్లి వారు మర్యాదలు సరిగా జరగలేదంటూ ఆడపిల్ల వారితో గొడవలకు దిగడం కనిపిస్తూనే ఉంటుంది. కట్నం విషయంలోనో, మర్యాదల విషయంలోనో, వంటల విషయంలోనో ఇలాంటివి తరచుగా చూస్తుంటాం. అలాంటి ఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ లో చోటు చేసుకుంది. పెళ్లి భోజనాల్లో పనీర్ పెట్టలేదని వధూవరుల కుటుంబాలకు చెందిన బంధువులు గొడవకు దిగారు. చివరికి బెల్టులతో కొట్టుకున్నారు. దీంతో ఈ ఘటన హల్చల్ గా మారింది.
వరుడి బంధువు ఒకరు వివాహ విందులో పనీర్ పెట్టలేదంటూ వధువు తరఫు వారితో గొడవకు దిగాడు. ఇది కాస్త పెద్ద దుమారంగా మారింది. దీంతో వరుడు, వధువు బందు వర్గం ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీనికి సంబంధించి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు కొంతమంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గొడవకు కారణమైన కొందరిని అరెస్టు చేశారు. పోలీసుల రంగప్రవేశంతో ఇరువర్గాల మధ్య ఆ తరువాత రాజీ కుదిరింది. దీంతో పోలీసులు అందరినీ విడిచి పెట్టారు.
పంజాబ్ సరిహద్దుల్లో డ్రగ్స్, ఆయుధాలను జారవిడిచిన పాక్ డ్రోన్.. స్వాధీనం చేసుకున్న బీఎస్‌ఎఫ్..
ముందుగానే చెప్పుకున్నట్లు ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు.. గత నవంబర్ లో తెలంగాణలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. పీటల మీద పెళ్లి ఆగి పోవడానికి చిన్న చిన్న విషయాలు కూడా కారణాలుగా మారుతున్నాయి. నేటి కాలంలోనూ పెళ్ళికొడుకు తరఫువారు.. వధువు తరఫు వారిని మర్యాదల పేరుతో రకరకాలుగా వేధించడం అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. కట్నం సమయానికి అందలేదనో, సరిపోలేదనో... అమ్మాయికో, అబ్బాయికో ప్రేమ వ్యవహారం ఉందని చివరి నిమిషంలో తెలియడం వల్లనో పెళ్లిళ్లు ఆగిపోతాయి. కానీ చికెన్ వండలేదని ఓ పెళ్లి ఆగిపోయింది. అదీ విచిత్రం...
నాలుగైదు దశాబ్దాల కిందట ఊర్లలో మాంసం కూర వడ్డంచలేదని, అందులో నల్లిబొక్క రాలేదని పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయిన ఘటనలు మన పెద్ద వాళ్ళు చెబుతుంటే వింటుంటాం. కానీ, ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా కనిపించడం.. అది కూడా..హైదరాబాదు లాంటి మహానగరంలో జరగడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్ళికొడుకు స్నేహితులకు భోజనంలో చికెన్ వడ్డించలేదని ఓ పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ షాపూర్ నగర్ లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన వరుడు, కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు.
షాపూర్ నగర్లోని ఓ పంక్షన్ హాల్లో ఈ సందర్భంగా ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడపెళ్లి వారు బీహార్ కు చెందిన మార్వాడి కుటుంబీకులు కావడంతో శాకాహార వంటలు చేశారు. విందు ముగింపు దశలో పెళ్లి కుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదని గొడవపడి, తినకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య గొడవ జరిగి.. వివాహం ఆగిపోయింది. వెంటనే పెళ్లి కుమార్తె కుటుంబీకులు జీడిమెట్ల సీఐ పవన్ ను కలిసి, విషయం వివరించారు. ఆయన రెండు కుటుంబాల వారిని ఠాణాకు పిలిపించి, కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 30న వివాహం చేయాలని వధూవరుల కుటుంబీకులు నిర్ణయానికి వచ్చారు.
