Heavy Rains: ఈ వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఓడిశాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చిరింది. ఈ క్రమంలోనే ఒడిశాలోని పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Red alert issued to Odisha: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం పలు రాష్ట్రాలకు వారం రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారడంతో రానున్న 48 గంటల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది బలహీనపడి పశ్చిమ వాయవ్య దిశగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒడిశాలోని ప్రాంతీయ వాతావరణ శాఖ నాలుగు జిల్లాలు సుందర్‌గఢ్, ఝర్సుగూడ, బర్గఢ్, సంబల్‌పూర్ సహా వివిధ జిల్లాల్లో బుధవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బీహార్ లో ఆగస్టు 5 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మధ్యప్రదేశ్ లో ఆగస్టు 4 వరకు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 03న మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
యూపీ, రాజస్థాన్, కొండ ప్రాంతాల్లోనూ వర్షాలు..
ఉత్తరప్రదేశ్, హిమాలయ రాష్ట్రాలు, రాజస్థాన్ లో ఈ వారం వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి లేదా ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లలో ఆగస్టు 5 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లలో ఆగస్టు 3 నుంచి 5 వరకు వర్షాల వేగం పుంజుకోనుంది.
ఆగస్టు 3 వరకు తూర్పు ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 3 నుంచి 5 వరకు ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక ఆగస్టు 3, 4 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ లలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అదేవిధంగా కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలో కూడా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగస్టు 1,4,5 తేదీల్లో గుజరాత్ ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 4 వరకు కోస్తా కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
