తమిళభాషను అమితంగా ఇష్టపడే కరుణానిధి ఆ భాష ఉన్నతికి ఎంతో కృషి చేశారు. ప్రపంచ తమిళ మహాసభలతో పాటు సినిమా పేర్లు తమిళంలోనే ఉంటేనే పన్ను మినహాయింపు అని తేల్చి చెప్పారు. అంతగా మాతృభాషను ఇష్టపడే కరుణానిధి తన సంతానానికి తమిళంలోనే పేర్లు పెట్టారు. కానీ ఒక్క స్టాలిన్‌కు మాత్రం.. ఇంగ్లీష్‌లో పెట్టారు.. దీనికి ఒక కారణం ఉంది..

కరుణానిధి తన రెండో భార్యకు రెండో కుమారుడిగా పుట్టిన బాబుకి.. తన అభిమాన నేతలు పెరియార్ రామస్వామి, అన్నాదురైల పేర్లు కలిసివచ్చేలా ‘‘అయ్యాదురై’’ అని కలిసివచ్చేలా పేరు పెట్టాలనుకున్నారు. పెరియార్‌ను ‘‘అయ్యా’’ అని పిలిచేవారు కరుణానిధి.. అలాగే అన్నాదురైని ‘‘అన్నా’’ అని ప్రేమతో పిలిచేవారు.

అయితే 1953 మార్చి 5న కమ్యూనిష్టు నేత, రష్యా అధినేత జోసెఫ్ స్టాలిన్ మరణించారు. ఆ తర్వాత చెన్నైలో స్టాలిన్ సంస్మరణ సభ జరిగింది. ఆ సభ జరిగే నాటికి బిడ్డ వయసు కేవలం నాలుగు రోజులే.. దీంతో ఆ సభలోనే తన కుమారుడికి స్టాలిన్ అని పేరు పెడుతున్నట్లు కరుణానిధి ప్రకటించారు.