Asianet News TeluguAsianet News Telugu

శివసేన సంచలన ప్రకటన.. ‘కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుంచి తప్పుకునేందుకు రెడీ.. ఎమ్మెల్యేలు ముందుగా తిరిగి రావాలి’

శివసేన సంచలన ప్రకటన చేసింది. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నుంచి తప్పుకోవడానికి రెడీ అని పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేలు ముందు ముంబయికి వచ్చి నేరుగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడాలని సంజయ్ రౌత్ తెలిపారు. 

ready to break maha vikas aghadi alliance with congress NCP says shivsena to rebel mlas
Author
Mumbai, First Published Jun 23, 2022, 4:16 PM IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు గంట గంటకు మలుపు తిరుగుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం తర్వాత ఈ పరిణామాలు మరింత వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షను కుటుంబ సమేతంగా వీడారు. తాజాగా, ఈ హైడ్రామా మరో మలుపు తిరిగింది. ఏక్‌నాథ్ షిండే తన బలాన్ని ఎమ్మెల్యేల వీడియోతో వెల్లడించడంతో ఠాక్రే పక్షం ఇంకా ఎక్కువ సేపు కాలాన్ని వృథా చేయాలని భావించట్లేదని అర్థం అవుతున్నది. అందుకే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. 

మహా వికాస్ అఘాదీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి) నుంచి తప్పుకోవడంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందరూ తిరిగి ముంబయికి వచ్చేయాలని వివరించారు. 24 గంటల్లో వారు ముంబయిలో ఉండాలని అన్నారు. ఏ విషయమైనా అక్కడే గువహతిలో ఉండి సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ చేయడాన్ని ఆపేయండి అని పేర్కొన్నారు. ఏ విషయమైనా సరే.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో నేరుగా చర్చించాలని వివరించారు. 24 గంటల్లో వారు ముంబయిలో ఉండాలని సంజయ్ రౌత్ అన్నారు.

గువహతిలో క్యాంప్ వేసిన ఏక్‌నాథ్ షిండే దగ్గర 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తున్నది. శివసేన వెంటనే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుంచి తప్పుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండున్నరేళ్ల సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన ఎమ్మెల్యేలు చాలా నష్టపోయారని వివరించారు. కాబట్టి, వెంటనే ఆ పార్టీలతో పొత్తు తెంపుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, మహా వికాస్ అఘాదీ నుంచి తప్పుకోవడానికి రెడీ అని చెప్పిన సందర్భంలో కాంగ్రెస్ కూడా అప్రమత్తం అయినట్టు తెలుస్తున్నది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సహ్యాద్రి గెస్ట్ హౌజ్‌లో కాంగ్రెస్ అత్యవసర సమావేశానికి పిలుపు ఇచ్చింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హెచ్‌కే పాటిల్, బాలా సాహెబ్ థోరట్, నానా పటోలే, అశోక్ చవాన్‌లు హాజరుకానున్నారు. సంజయ్ రౌత్ ప్రకటన తర్వాతే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కాగా, ఎన్సీపీ ఇది వరకే తమ వైఖరిని వెల్లడించారు. శివసేన ప్రభుత్వం కొనసాగితే అధికారపక్షంలో కూర్చుంటామని లేదంటే.. ప్రతిపక్షంలో కూర్చుంటామని ఎన్సీపీ లీడర్ జయంత్ పాటిల్ వివరించారు. అంతేకాదు, శరద్ పవార్ ఎన్సీపీ నేతలతో సమావేశమై కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. ఏదైనా జరగొచ్చని స్ట్రగుల్‌కు రెడీగా ఉండాలని సూచనలు చేశారు. ఒక వేళ ప్రభుత్వం కూలిపోతే.. తమ రాజకీయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్దేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios