చెన్నై: తండ్రి మరణం తర్వాత డిఎంకెలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన కరుణానిధి కుమారుడు అళగిరి చివరకు దిగివచ్చారు. ఈ నెల 28వ తేదీన డిఎంకె అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తనకు సోదరుడే లేడంటూ అళగిరి గట్టి సంకేతాలు పంపించారు. ఈ స్థితిలో చివరకు స్టాలిన్ తో కలిసి పనిచేయడానికి రాయబారాలు నడుపుతున్నాడు. 

ఇప్పటి వరకు హెచ్చరికలు చేసిన అళగిరి రాయబారాలు పంపుతున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తనను పార్టీలోకి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చిన అళగిరి ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. తనను పార్టీలోకి తీసుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధమని రాయబారం పంపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ్ముడితో తనకు మధ్యసయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. తాను డీఎంకే పార్టీలో చేరాలనుకుంటే.. అప్పుడు స్టాలిన్‌ను నాయకుడిగా అంగీకరించాల్సిందే.. కాదంటారా అని సన్నిహితులను అడుగుతున్నారు. 
 
 కరుణానిధి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే అధ్యక్ష పీఠంపై అళగిరి కన్నేశారు. అప్పటికే కరుణానిధి రాజకీయ వారసుడిగా, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న స్టాలిన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యే సమయానికి తాను రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. స్టాలిన్ నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. అయితే 2014లో డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు.  కరుణానిధి మృతితో అళగిరి మళ్లీ తన వ్యూహాలకు పదునుపెడదామని ప్రయత్నించి చివరికి తమ్ముడితో రాజీకి రెడీ అవుతున్నారు.  

 తమ్ముడితో సయోధ్యకు ప్రయత్నిస్తున్న అళగిరి సెప్టెంబర్ 5న చెన్నైలో నిర్వహిస్తానన్న శాంతి ర్యాలీ నిర్వహిస్తారా లేదా అన్నది సందిగ్ధంలో పడింది. దాదాపు లక్షమందితో చెన్నై మహానగరంలో బలప్రదర్శనకు దిగేందుకు ప్లాన్ చేసిన అళగిరి తాజాగా తమ్ముడి నాయకత్వాన్ని బలపరచడం చూస్తే ర్యాలీపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నికవ్వడం.....పార్టీలోని క్రియాశీలక నేతలు స్టాలిన్ వెంట వెళ్లిపోవడంతో ర్యాలీపై అళగిరి పునరాలోచనలో పడ్డారు.