Asianet News TeluguAsianet News Telugu

ఆర్బీఐ రేపో రేటు పెంపు.. లోన్లు తీసుకున్న వారికి షాక్ !

RBI Monetary Policy: భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. 2023-24లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం, క్యూ1 7.8 శాతం, క్యూ2 6.2 శాతం, క్యూ3 6 శాతం, క్యూ4 5.8 శాతంగా ఉండొచ్చని భార‌త రిజ‌ర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంచనా వేసింది.
 

RBI Hikes Repo Rate: Central Bank Hikes Repo Rate By 25 Bps To 6.5%
Author
First Published Feb 8, 2023, 1:32 PM IST

RBI Hikes Repo Rate: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా  రెపో రేటును పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్లను పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాయ‌నీ, కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తే ఈఎంఐ చెల్లింపు మరింత పెరుగుతాయ‌ని మార్కెట్ నిపుణ‌లు పేర్కొంటున్నారు. రెపో రేటు పెంపు వల్ల బ్యాంకుల‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగడంతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అభిప్ర‌య‌ప‌డుతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) బుధవారం కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి నిర్ణయించింది. రెపో రేటు పెంపుపై ముందుకు వెళ్లాలని ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గత ఏడాది మే నెలలో ప్రారంభమైన రేట్ల పెంపు నేపథ్యంలో శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశాన్ని ఫిబ్రవరి 6న ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) పెంచి 6.5 శాతానికి ప్రకటించింది. ఒక అనుకూలమైన వైఖరిని కొనసాగిస్తూ, ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు సెంట్రల్ బ్యాంక్ తన నిబద్ధతను కొనసాగించిందనే చెప్పాలి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు, ద్రవ్యోల్బణం గణాంకాలు మన ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది, అయితే ప్రపంచ సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంది, కాబ‌ట్టి దీనికి అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంది : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 
 

రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 శాతం ఎగువ స్థాయి కంటే తక్కువగా ఉండటం, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించే అవకాశం ఉన్నందున, సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటులో 25 బేసిస్ పాయింట్ల పెంపును మాత్రమే ఎంచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ త‌న ప్ర‌సంగంలో.. ఎంపీసీ 4:2 ఓట్లతో అకామోడేటివ్ పాలసీ ఉపసంహరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. "ప్రపంచ ఆర్థిక దృక్పథం కొన్ని నెలల క్రితం వలె ఇప్పుడు భయంకరంగా కనిపించడం లేదు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయి, అయితే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది, అయినప్పటికీ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యానికి మించి ఉంది" అని ఆయన చెప్పారు. "ఈ సమయంలో 25 bps రేటు పెంపు సముచితంగా పరిగణించబడుతుంది..  ద్రవ్య విధానం చురుకైనదిగా, ద్రవ్యోల్బణం పట్ల అప్రమత్తంగా ఉండటం" అని ఆయ‌న తెలిపారు.

2023-2024లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శ‌క్తికాంద దాస్ తెలిపారు. "సాధారణ రుతుపవనాల ఊహపై, 2023-24కి సిపిఐ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా అంచనా వేయబడింది" అని దాస్ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. 2023-24లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం, క్యూ1 7.8 శాతం, క్యూ2 6.2 శాతం, క్యూ3 6 శాతం, క్యూ4 5.8 శాతంగా ఉండొచ్చని భార‌త రిజ‌ర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంచనా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios