వెయ్యి లీటర్ల మద్యం ఏమైందని అధికారులు అడిగితే ఎలుకలు తాగాయని పోలీసులు చెప్పిన సాకు ఇప్పుడు ఉత్తరప్రదశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వెయ్యి లీటర్ల మద్యాన్ని పోలీసులు బరేలీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన గోడౌన్‌లో భద్రపరిచారు.

ఇటీవల అందులోకి ప్రవేశించిన ఓ కుక్క చనిపోవడంతో ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తోంది. స్థానికుల సమాచారం మేరకు కుక్క మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు గోడౌన్‌ను తెరిచారు. అదే సమయంలో అక్కడ భద్రపరిచిన మద్యం సీసాలు కనిపించలేదు.

అలాగే, అక్కడున్న మరికొన్ని సీసాలు ఖాళీగా ఉండటంతో పాటు వాటికి రంధ్రాలు ఉన్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దాకా వెళ్లడంతో వారు సిబ్బందిని విచారించగా.. ఎలుకలే మద్యం తాగి ఉండవచ్చని వారు సమాధానం చెప్పారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించారు. తాము స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ముందు గదుల్లో నిల్వ చేసి, శాంపిల్స్ సేకరించి అనంతరం వాటిని పారబోస్తామని తెలిపారు. అయితే ఇంత వరకు స్వాధనం చేసుకున్న మద్యాన్ని ఎందుకు పారబోయలేదోనని ఆయన సిబ్బందిని ప్రశ్నించారు.

మాయమైన మద్యంపై వివరాలు తెలపాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మద్యం ఎలుకలు తాగాయని గతంలోనే చాలామంది ఖాకీలు చెప్పారు. తాము స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎలుకలు తాగినట్లు బిహార్ పోలీసులు, 45 కేజీల మాదక ద్రవ్యాలను మూషికాలు తినేశాయని జార్ఖండ్ పోలీసులు ఆరోపించిన ఘటనలు పెద్ద దుమారాన్ని రేపాయి.