Rashtrapatni Row: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్ర‌ప‌త్ని' అని అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో పార్లమెంట్‌లో దుమారం రేగింది. ఈ వ్యాఖ్య‌లను బీఎస్పీ అధినేత మాయావ‌తి కూడా తీవ్రంగా ఖండించారు. 

Rashtrapatni Row: భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని సంభోదించడంతో కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ‌ దూమారం రేగుతోంది. బుధవారం నాడు పార్ల‌మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన సందర్భంగా.. అధిర్ రంజన్ చౌదరి .. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తో పాటు.. సోనియా గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 

ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేర‌కు ఎంపీ అధిర్ రంజన్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. క‌మిష‌న్ ముందు.. హాజరు కావాలని, వ్యాఖ్యల పట్ల లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ చేయ‌నున్నట్టు క‌మిష‌న్ త‌న నోటిసుల్లో పేర్కొంది. 

అంతేకాదు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై తగిన చర్యలు తీసుకోవాలని క‌మిష‌న్ పేర్కొంది.

తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై బీఎస్పీ అధినేత మాయావ‌తి స్పందించారు. రాష్ట్ర‌ప‌తి ముర్ముని రాష్ట్ర‌ప‌త్నిగా అభివ‌ర్ణించ‌డం అత్యంత సిగ్గుచేటు అని ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై మండిప‌డ్డారు.కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. అధిర్ వ్యాఖ్య‌ల ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మాయావ‌తి డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ట్వీట్ చేస్తూ.. భార‌త‌దేశ అత్యున్న‌త ప‌ద‌వికి గిరిజ‌న తెగ నుంచి తొలి మహిళగా ద్రౌపది ముర్ము జీ అద్భుతంగా ఎన్నుకోవడం చాలా మందికి నచ్చలేదు. ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్య‌లు చేయ‌డం చాలా విచార‌క‌రం. అవమానకరం, అత్యంత ఖండించదగినవి అని మాయావ‌తి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అధిర్ వ్యాఖ్య‌లతో నేడు పార్లమెంటు కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా దేశానికి క్షమాపణ చెప్పి కులతత్వ ధోరణిని విడనాడడం సముచితమ‌ని అన్నారు.