రాత్రి బైక్ ఎక్కిన ప్రయాణికురాలిపై ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేేధింపులకు పాల్పడుతూ నీచంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 

బెంగళూరు : సురక్షితంగా ఇంటికి చేరుస్తాడని నమ్మి అర్ధరాత్రి ముక్కూ మొఖం తెలియనివాడి బైక్ ఎక్కిన మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. ర్యాపిడో డ్రైవర్ ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఐటీ సిటీ బెంగళూరులో వెలుగుచూసింది. అతడి నుండి తప్పించుకునేందుకు వేగంగా వెళుతున్న బైక్ పైనుండి దూకేయడంతో యువతి స్వల్ప గాయాలపాలయ్యింది.

పోలీసులు, బాధిత యువతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ మహిళ రాత్రి 11గంటల వరకు ఆఫీసులో పనిచేసి ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. రాత్రి సమయంలో తొందరగా ఇంటికి చేరాలని భావించి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. అయితే ఆమె ఒంటరిగా వుండటంతో ర్యాపిడో డ్రైవర్ నీచంగా ప్రవర్తించాడు. బైక్ ఎక్కేముందే ఓటిపి చెక్ చేసుకుంటానంటూ ఆమె ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత బైక్ పై వెళుతున్న సమయంలో ఆమెను ఎక్కడపడితే అక్కడ తాకుతూ వేధింపులకు దిగాడు.

Read More మద్యం మత్తులో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య..

ఇక మహిళ బుక్ చేసిన ఇందిరానగర్ కు కాకుండా దొడ్డ బల్లాపూర్ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన ఆమె డ్రైవర్ ను ప్రశ్నించగా ఆమె మాటలు పట్టించుకోకుండా బైక్ వేగాన్ని మరింత పెంచాడు. దీంతో అతడి నుండి తప్పించుకునేందుకు బైక్ పైనుండి దూకేసింది. దూకేముందే అతడి చేతిలోని తన సెల్ ఫోన్ లాక్కుంది. రన్నింగ్ బైక్ పైనుండి దూకడంతో స్వల్పంగా గాయపడిన మహిళ సాయం కోసం స్నేహితుడికి ఫోన్ చేసింది. వెంటనే అతడు అక్కడికి చేరుకున్న స్నేహితుడితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన బాధిత యువతి ఫిర్యాదు చేసింది. 

యువతి నుండి వివరాలు సేకరించిన పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన సదరు ర్యాపిడో డ్రైవర్ ను గుర్తించి అరెస్ట్ చేసారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ర్యాపిడో యాప్ సిబ్బందికి కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని బాధిత యువతి తెలిపింది.