అత్యాచారం కేసులో అండర్ ట్రయిల్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న నిందితుడికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ రాగా.. క్వారంటైన్ తరలించారు. అతనితోపాటు మరో ముగ్గురు ఖైదీలకు కూడా పాజిటివ్ రావడం గమనార్హం.

అత్యాచారానికి గురైన మహిళకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో రావడంతో ఆమెపై అత్యాచారం చేసిన నిందితుడైన ఖైదీకి కూడా కరోనా లక్షణాలున్నాయని గుర్తించారు. అతన్ని పరీక్షించగా మొదట కరోనా పాటిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో సదరు ఖైదీతోపాటు అదే సెల్ లో ఉన్న మరో ఇద్దరు ఖైదీలకు కరోనా సోకిందని క్వారంటైన్ చేశారు. ముగ్గురు ఖైదీలకు మరోసారి పరీక్షించగా వారికి కరోనా నెగిటివ్ అని తేలిందని అధికారులు చెప్పారు.  

ఇదిలా ఉండగా... 

ముంబై నగరంలోని ఆర్థర్ రోడ్ జైలులో ఏకంగా 103 మందికి కరోనా వైరస్ సోకిన ఘటన సంచలనం రేపింది. ఆర్థర్ రోడ్ జైలులో 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 26 మంది జైలు ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో రావడం కలకలం రేపింది. కరోనా సోకిన ఖైదీలు, జైలు ఉద్యోగులను శుక్రవారం ఉదయం ముంబైలోని సెయింట్ జార్జ్ , గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు. 

ఖైదీలున్న ఆసుపత్రుల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ టీవీ కెమెరాలతో నిఘా వేసి ఉంచారు. గతంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచారు. అతనికి కరోనా ఉందని, అతని ద్వార ఇతర ఖైదీలు, జైలు సిబ్బందికి వచ్చిందని అనుమానిస్తున్నారు. గతంలో కరోనా వచ్చిన ఖైదీని జేజే ఆసుపత్రికి తరలించారు. 

జైల్లో ఖైదీలకు కరోనా వైరస్ సోకడంతో ఇకనుంచి కొత్తగా జైలుకు వచ్చే ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కొవిడ్ రోగులున్న కస్తుర్బా ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రి ఎదుట ఆర్థర్ రోడ్ జైలు ఉండటంతోపాటు జైలులోకి నిత్యావసర సరకులు, కూరగాయలు, పాలు వ్యాన్లలో సరఫరా చేస్తున్న వ్యాపారుల ద్వార కరోనా జైలులోకి వచ్చి ఉంటుందేమోనని జైళ్ల శాఖ ఇన్ స్పెక్టర్ జనరల్ దీపక్ పాండే అనుమానం వ్యక్తం చేశారు. 

జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో వారికి సబ్బులు, మాస్క్ లు, శానిటైజర్లు ఇచ్చి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని జైలు అధికారులు చెప్పారు. 800 కెపాసిటీ ఉన్న ఈ జైలులో 2600 మంది ఖైదీలను ఉంచడంతో రద్దీగా మారింది. థానే, తలోజా జైళ్లలోకి కొత్తగా ఖైదీలను తీసుకోవడం లేదు. 

కరోనా రోగుల వల్ల జైల్లో ఉన్న 2600 మంది ఖైదీలకు కరోనా ప్రబలే అవకాశం ఉందని భయాందోళనలు చెందుతున్నారు. కాగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో చిన్న కేసుల్లో జైలుకు వచ్చిన 11వేల మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించామని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. జైల్లో కరోనా కలకలంతో పలువురు ఖైదీల బంధువులు వారికి బెయిల్ ఇప్పించేందుకు న్యాయవాదులను సంప్రదిస్తుండటం గమనార్హం.