ఎప్పటి నుంచి మార్కెట్లోకి పతంజలి జీన్స్ రాబోతున్నాయనే ప్రచారం జరిగింది. కాగా.. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. ఇప్పటివరకు నిత్యవసర వస్తువులు, బ్యూటీ ప్రాడక్ట్స్ లాంటి మాత్రమే అందించిన పతంజలి సంస్థ  ఇప్పుడు వస్త్ర ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. 

పతంజలి పరిధాన్ పేరటి యాక్సెసరీస్ స్టోర్ ని రామ్ దేవ్ బాబా దేశరాజధాని ఢిల్లీలో సోమవారం ప్రారంభించారు. ధనత్రయోదశి, దీపావళి పండగల సందర్భంగా ఈ జీన్స్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు రామ్ దేవ్ బాబా తెలిపారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ స్టోర్‌లో మహిళలు, పురుషులు, చిన్నారులకు రకరకాల దుస్తులు లభించనున్నాయి. అంతేకాదు.. తొలి వస్త్రదుకాణాన్ని తెరిచినందుకు గాను పతంజలి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు 25శాతం డిస్కౌంట్‌ కింద వస్త్రాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇక పతంజలి జీన్స్‌ రూ.500కే లభిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. రూ.2500 బ్రాండెడ్‌ షర్ట్స్‌ రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు. పండుగ సీజన్‌ పురస్కరించుకొని ఒక జీన్స్‌, రెండు టీ షర్టులను(రూ.7000 విలువ చేసే) కేవలం రూ.1100కే ఇస్తున్నట్లు తెలిపారు.