Rama Navami : అయోధ్య రామయ్యకు 'సూర్య తిలకం' ... ఆ దివ్యమంగళ రూపం అద్భుతం... మహాద్భుతం
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య బాలరాముడికి ఆ సూర్య భగవానుడే తిలకం దిద్దాడు. కేవలం కొద్దిక్షణాలు మాత్రమే ఆవిష్కృతమైన ఈ అద్భుత సమయంలో దగదగా మెరిసిపోతున్న రామయ్య దివ్యమంగళ రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి గురయ్యారు.
అయోధ్య : శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత జరుగుతున్న మొదటి శ్రీరామనవమి ఇదే... దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వరంలో అయోధ్యలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ శ్రీరామనవమి వేడుకల్లోనే హైలైట్ గా నిలిచింది 'సూర్య తిలకం'. ఆ సూర్యభగవానుడే అయోధ్య గర్భగుడిలో కొలువవైన శ్రీరాముడికి తన కిరణాలతో తిలకం దిద్దాడు. ఇలా సూర్య తిలకంతో మెరిసిపోతున్న బాలరాముడి విగ్రహం భక్తులకు కనువిందు చేసింది.
ఏమిటీ సూర్యతిలకం?
అయోధ్య రామమందిరం దేశంలోని మెజారిటీ ప్రజల దశాబ్దాల కల. దాన్ని నెరవేరుస్తూ రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణం జరిగింది. దేశ ప్రజల సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామమందిర నిర్మాణం జరిగింది. ఇలా నిర్మించిన రామాలయం అద్భుత శిల్పకళా సంపదతో అందంగానే కాదు మరెన్నో ప్రత్యేకతలు కలిగివుంది. అందులో ఎంతో కీలకమైనది ఈ 'సూర్యతిలకం'
రఘువంశోత్తముడైన ఆ బాలరాముడి కొలువైన గర్భగుడిలోకి సరిగ్గా శ్రీరామనవమి రోజులు సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇందుకోసం ఆలయ నిర్మాణ సమయంలోనే కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల సహకారం తీసుకుంది ట్రస్ట్. ఇలా శ్రీరామ నవమి రోజున సరిగ్గా 12 గంటలకు అయోధ్య బాలరాముడికి సూర్యకిరణాలు తిలకం దిద్దాయి.
బాలరాముడికి సూర్యతిలకం ఎలా సాధ్యమయ్యింది...
అయోధ్య మందిర నిర్మాణం సమయంలోనే శిఖరభాగంలో ఓ ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటుచేసారు. ఇది సూర్యకిరణాలను గ్రహిస్తుంది. ప్రతిరోజూ కొంత కదులుతూ సరిగ్గా రామనవమి నాటికి ఓ స్ధానానికి వచ్చేస్తుంది. ఈ స్థానంలోకి వచ్చిన పరికరంపై సూర్యకిరణాలు పడగానే అవి నేరుగా గర్భగుడిలోకి ప్రసరిస్తాయి. సరిగ్గా 12 గంటలకు ఈ కిరణాలు బాలరాముడి నుదిటిపైకి చేరతాయి.
అయోధ్యకు పోటెత్తిన భక్తులు :
శ్రీరామ నవమిని పురస్కరించుకుని అయోధ్యకు భక్తులు పోటెత్తారు. స్వయంగా సూర్యభగవానుడే తన కిరణాలతో బాలరాముడికి తిలకం దిద్దే అద్భుత ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు పరితపించారు. అయితే ఈ భాగ్యాన్ని దేశ ప్రజలందరికీ కల్పించే ఉద్దేశంతో ప్రత్యక్ష ప్రసారం చేసారు అయోధ్య ఆలయ అధికారులు. శ్రీరాముడిని సూర్యుడు తన కిరణాలతో అభిషేకించి తిలకం దిద్దుతుండటం చూస్తూ రామభక్తులు మైమరచి పోయారు.
ప్రధాని మోదీ రామనవమి శుభాకాంక్షలు :
శ్రీరామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.''బాలరాముడు అయోధ్య రామమందిరంలో కొలువైన తర్వాత జరుపుకుంటున్న మొదటి రామనవమి ఇదే. ఈ రామనవమి వేడుకలతో ఇవాళ అయోధ్య అమితమైన ఆనందంలో వుంది. దాదాపు 5 శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో ఇంత వైభవంగా రామనవమి జరుపుకునే అవకాశం దక్కింది. దేశ ప్రజలు ఇన్ని సంవత్సరాలు చేసిన పోరాటం, త్యాగాలు, బలిదానాల ఫలితమే అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు'' అంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికన స్పందించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలొ కొలువైన రామ్ లల్లాకు సూర్యతిలకం దిద్దే అద్భుత ఘట్టాన్ని చూసి రాజకీయ ప్రముఖులు తన్మయానికి గురయ్యారు. ఇలాంటి అద్భుత దృశ్యం కళ్లారా చూడటంతో తన జన్మ ధన్యమయ్యిందని రామభక్తులు అంటున్నారు.