రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.. ఇక చట్టం కావడమే తరువాయి
మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 215 మంది సభ్యులు ఓటేశారు. దాదాపు పది గంటలకు పైగా ఈ బిల్లుపై చర్చించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. దాదాపు పది గంటలకు పైగా ఈ బిల్లుపై చర్చించారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 215 మంది సభ్యులు ఓటేశారు. ఏ ఒక్కరూ కూడా వ్యతిరేకంగా ఓటేయకపోవడం గమనార్హం. ఇప్పటికే ఈ బిల్లులో ఆమోదం లభించడంతో, రాష్ట్రపతి సంతకంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారనుంది. సుదీర్ఘ చర్చ అనంతరం ఆటోమేటిక్ ఓటు రికార్డింగ్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ చేపట్టారు. సభ్యుల సీటు వద్ద వున్న మల్టీ మీడియా డివైజ్ సాయంతో ఓటింగ్ నిర్వహించారు.
అంతకుముందు గురువారం ఉదయం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందినా అమలు చేసేది మాత్రం 2029 తర్వాతేనని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలు ముగిసిన వెంటనే జనగణన, డీలిమిటేషన్ చేపడతామని, వీలైనంత త్వరగా చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ALso Read: సాకారమైన దశాబ్ధాల కల, మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకంగా ఓటేసిన ఎంఐఎం
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో దాదాపు 8 గంటల పాటు చర్చ జరగ్గా.. 60 మంది సభ్యులు మాట్లాడారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అయితే బిల్లుపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. బిల్లు అసంపూర్తిగా వుందని విపక్షాలు మండిపడ్డాయి. ఓబీసీ కోటా వుండాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ చేపట్టారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులుగా అందజేశారు. బిల్లుకు అనుకూలమైతే ఆకుపచ్చ స్లిప్పుపై ‘ఎస్’ అని, వ్యతిరేకమైతే ఎరుపు రంగు స్లిప్పుపూ ‘‘నో’’ అని రాయాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్ వివరించారు. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్‌లు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.