ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఆర్‌ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పర్స్‌ చిత్ర బృందాలకు రాజ్యసభలో అభినందనలు వెల్లువెత్తాయి. 95వ అకాడమీ అవార్డ్స్‌లో భారత్‌కు ఘనమైన కీర్తి దక్కిందని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ అన్నారు

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో భారత్ రెండు అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ది ఎలిఫెంట్ విస్పర్స్‌కు అవార్డులు దక్కాయి. ఈ క్రమంలోనే మంగళవారం రాజ్యసభలో ఆర్‌ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పర్స్‌ చిత్ర బృందాలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ రోజు ఉదయం సమావేశాలు ప్రారంభమైన తర్వాత రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ‘‘నాటు నాటు’’ పాట, ‘‘ది ఎలిఫెంట్ విస్పర్స్’’ షార్ట్ ఫిల్మ్స్ గురించి ప్రస్తావించారు. 

95వ అకాడమీ అవార్డ్స్‌లో భారత్‌కు ఘనమైన కీర్తి దక్కిందని అన్నారు. ది ఎలిఫెంట్ విస్పర్స్, ఆర్‌ఆర్‌ఆర్ విజయాలు భారత్ ఉత్పత్తి చేసే సినిమా పూర్తి స్పెక్ట్రమ్‌కు కొత్త గుర్తింపుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ‘‘ఈ అవార్డులు భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతర్జాతీయీకరణకు మరింత సహాయపడతాయి. ఈ విజయాలు భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత, అంకితభావానికి ప్రపంచ ప్రశంసలను ప్రతిబింబిస్తాయి’’ అని అన్నారు. వారు సంపాదించుకున్న గుర్తింపుకు గానూ.. ఈ రెండు టీమ్‌లకు సంబంధించిన బృందాలకు అభినందనలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. 

ఆ తర్వాత పార్టీలకు అతీతంగా పలువురు సభ్యులు.. ది ఎలిఫెంట్ విస్పర్స్, ఆర్‌ఆర్‌ఆర్ టీమ్స్‌కు అభినందనలు తెలియజేశారు. లీడర్ ఆఫ్ ది హౌస్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘ది ఎలిఫెంట్ విస్పర్స్‌ను ఇద్దరు మహిళలు మహోన్నతంగా రూపొందించారు. ఇది జెండర్‌కు సంబంధించినది. ఇది మన భారతదేశంలోని మహిళల పట్ల గౌరవం గురించి. ఇది భారత మహిళలకు గొప్ప గుర్తింపు’’ అని అన్నారు. ఇది సుస్థిరతకు సంబంధించినది, ఇది మన తత్వశాస్త్రంలో ప్రధానమైనదని చెప్పారు. ఆర్‌ఆర్ఆర్ స్క్రిప్ట్ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారని గుర్తుచేశారు. 

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దక్షిణాది నుంచి రెండు సినిమాలకు ఈ అవార్డు దక్కడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అలవాటైన పంథాలో.. ఆస్కార్‌ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేయకూడదని ఆయన అన్నారు.‘‘మేం దర్శకత్వం వహించామని, కవిత రాశామని, లేదా మోడీజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని అధికార పార్టీ క్రెడిట్‌ తీసుకోకూడదని నా విన్నపం’’ అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…


ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించరాదని కోరారు. ఈ సమయంలో పీయూష్ గోయల్ జోక్యం చేసుకున్నప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఇది సామూహిక వేడుకల సందర్భం. లీడర్ ఆఫ్ ది హౌస్ చేస్తున్న సంకుచిత పక్షపాత పాయింట్ కోసం కాదు’’ అన్నారు.

రాజ్యసభలో సినీ ప్రముఖుల గురించి చర్చిస్తున్నందుకు సంతోషంగా ఉందని సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ జయ బచ్చన్ అన్నారు. చలనచిత్ర పరిశ్రమ దేశానికి ప్రాతినిధ్యం వహించిందని.. అనేక అవార్డులను గెలుచుకుందని చెప్పారు. సత్యజిత్ రే 1992లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారని గుర్తుచేశారు. ‘‘సినిమా మార్కెట్ ఇక్కడ ఉంది. ఇది అమెరికాలో లేదు’’ అని అన్నారు. అనంతరం అన్ని పార్టీల ఎంపీలు విజేతలకు అభినందనలు తెలిపారు. ఇక, సోషల్ మీడియాలో బాయ్‌కాట్ సంస్కృతిని అంతం చేయడంలో ఆస్కార్ దోహదపడుతుందని శివసేన (యూబీటీ)కి చెందిన ప్రియాంక చతుర్వేది ఆశాభావం వ్యక్తం చేశారు.