న్యూఢిల్లీ:  ఇండియా, చైనా సరిహద్దుల్లో చోటు చేసుకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారంనాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఇండియన్ నేవీ, ఆర్మీ,  ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

also read:భారత వాయిసేనలోకి రఫెల్ యుద్ధ విమానాలు: రాఫెల్, తేజాస్ యుద్ధ విమానాల ప్రదర్శన

భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు గాను  కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్  చైనా విదేశాంగ అధికారి యాంగ్ హీ తో గురువారం నాడు చర్చించారు.ప్యాంగ్యాంగ్ సరస్సు వెంట ఉన్న భారత్ భూ భాగాన్ని చైనా ఆక్రమించకుండా నిరోధించేందుకు భారత సైన్యం అనేక జాగ్రత్తలు తీసుకొంది.

కొన్ని రోజులుగా భారత, చైనా ఆర్మీ మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది. సరిహద్దుల్లో చైనా భారీగా సైన్యంతో పాటు యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీనికి తగ్గట్టుగానే ఇండియా కూడ చర్యలు తీసుకొంటుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టుగా ఇండియా ప్రకటించింది.ఇండియా వాయుసేనలో ఈ నెల 10వ తేదీన రఫెల్ యుద్ధ విమానాలు చేరాయి.