Asianet News TeluguAsianet News Telugu

రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. పెరరివాలన్‌‌ విడుదలకు ఆదేశం..

రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా ఉన్న పెరరివాలన్‌కు విడుదల చేయాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. 

Rajiv Gandhi Assassination Case Supreme Court Orders Release Of convict AG Perarivalan
Author
New Delhi, First Published May 18, 2022, 11:16 AM IST

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా ఉన్న పెరరివాలన్‌కు విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అధికారాలను సుప్రీం కోర్టు అమలు చేసింది. ఇక, రాజీవ్ హత్య కేసులో పెరరివాలన్.. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలోనే తన శిక్షను మినహాయించాలని 2018లో తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ విడుదలలో జాప్యం జరుగుతుందని పెరరివాలన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

అయితే పెరరివాలన్ అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది. తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సూచించారని.. ఆయన ఇంకా నిర్ణయం తీసుకులేదని తెలిపింది. అయితే నిర్ణయంలో జాప్యాన్ని, గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తమిళనాడు రాష్ట్ర కేబినెట్ సంబంధిత పరిశీలనలపై పెరరివాలన్‌కు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుందని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం తమిళనాడు గవర్నర్ తన అధికారాలను ఉపయోగించుకోవడంలో విపరీతమైన జాప్యం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని బెంచ్ పేర్కొంది.

ఇక, రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించి 19 ఏళ్ల వయసులో పెరరివాలన్ అరెస్టయ్యాడు. 1998లో పేరారివాలన్‌కు Anti-Terrorism Court మరణశిక్ష విధించింది. మరుసటి ఏడాది సుప్రీంకోర్టు ఆ శిక్షను సమర్థించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన బెల్ట్ బాంబును ప్రేరేపించడానికి ఉపయోగించిన 8-వోల్ట్ బ్యాటరీని కొనుగోలు చేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. 

2014లో పెరరివాన్, మరో ఇద్దరు మురుగన్, సంతన్  (ఇద్దరూ శ్రీలంక వాసులు) క్షమాభిక్ష పిటిషన్‌లు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్నందున దోషుల మరణశిక్షను.. జీవిత ఖైదుగా మార్చారు. ఇక, తమిళనాడు ప్రభుత్వం 2018లో ఈ కేసులో పెరారివాలన్‌తో పాటు మరో ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే వాటిని గవర్నర్.. రాష్ట్రపతికి ఫార్వర్డ్ చేశారు. ఇక, పెరరివాలన్‌‌కు ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలు.. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమం చేస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios