చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రం త్వరలోనే ఉంటుందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే ఓ కాంగ్రెస్ సీనియర్ నేత మాత్రం రజనీకాంత్ రాజకీయాల్లో రారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ స్పష్టం చేశారు. 

కొత్త సినిమాల విడుదల సమయంలో సినీ స్టంట్‌ తరహాలో ఏదో ఒక ప్రకటనను రజనీ ఇస్తున్నారని ఇళంగోవన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని, ఎవరి వాదనలు వారివేనన్నారు. 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అంటే తనకు ఎంతో గౌరవం అన్న ఇళంగోవన్ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటే, తమిళ ప్రజలు మరెన్నో ఏళ్లు ఆయనను కొనియాడుతారని మనసులో మాట బయటపెట్టారు. తనకు తెలిసినంత వరకు ఆయన రాజకీయాల్లోకి రారూ అన్నది స్పష్టమవుతోందన్నారు. 

సినిమాల బిజీలో ఉంటూ, సినిమా విడుదల సమయంలో సినీ తరహా స్టంట్‌ అన్నట్టుగా ఏదో ఒక ప్రకటన ఇస్తూ ముందుకు సాగుతున్నారన్నారే తప్ప ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావడం అనేది అనుమానమేనన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ రజనీ మాత్రం రాజకీయాల్లోకి రారూ అంటూ సినీడైలాగ్ చెప్పారు ఇళంగోవన్.