చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగా బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అనేది నిజమేనేమో అనిపిస్తోందన్నారు. సోమవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజనీ నోట్ల రద్దు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

ఇది సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశమని, ఈ విషయంపై ఒక్క మాటలో సమాధానం చెప్పటం కష్టమని పేర్కొన్నారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అనుకుంటున్నాయి కాబట్టే విపక్షాలు కూటమి దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయేమోనని వ్యాఖ్యానించారు. 

దేశంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రజనీకాంత్‌ ఇలా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చెయ్యడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

రెండేళ్ల క్రితం మోదీ పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు  ప్రకటించిన సమయంలో అందుకు మద్దతు తెలిపిన రజనీకాంత్  ప్రస్తుతం ఇలా యూటర్న్‌ తీసుకోవడం వెనుక కారణాలేమిటో అన్న చర్చ మెుదలైంది.