Rajdeep Sardesai: ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు జులైలో ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆయన క్యాన్సర్ యుద్ధాన్ని గెలిచారు. 60వ పుట్టినరోజు జరుపుకున్న కొద్ది వారాలకే ఇది ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపుగా నిలిచింది.
Rajdeep Sardesai Cancer Battle: ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తన ప్రోస్టేట్ క్యాన్సర్ పోరాటాన్ని బహిరంగంగా వెల్లడించారు. “స్ట్రైట్ బ్యాట్ విత్ రాజ్‌దీప్ సర్దేశాయ్” అనే వీక్లీ వీడియో వ్లాగ్‌లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. జూలైలో క్యాన్సర్ నిర్ధారణ అయ్యి, ఆగస్టులో న్యూ ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్ ఉన్న కణితిని తొలగించారు. ఇది ఆయన జీవితంలో కీలక మలుపుగా మారిందని తెలిపారు. ఆ సర్జరీ కేవలం కొన్ని వారాల ముందే ఆయన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు.
క్యాన్సర్ గురించి సర్దేశాయ్ తన అనుభవాలను వివరిస్తూ.. "ఒక సాధారణ మెడికల్ చెకప్‌లో బయాప్సీ చేయగా, ప్రాణాంతక కణితి ఉన్నట్టు తేలింది. ఆ వార్తను మొదట వాట్సాప్ సందేశంలో చదివినప్పుడు నా జీవితం తలకిందులైనట్టు అనిపించింది" అని చెప్పారు.
ఆ సమయంలో వచ్చిన భయం, గందరగోళం, సందేహాలను గుర్తుచేసుకున్నారు. “క్యాన్సర్ అనే పదం ఇప్పటికీ మనసులో భయాన్ని కలిగిస్తుంది” అని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి తనకు గుర్తున్న రాజేష్ ఖన్నా నటించిన ఆనంద్ సినిమాలో క్యాన్సర్‌తో పోరాడే పాత్రను ప్రస్తావించారు.
కుటుంబం ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్ పై పోరాటం
తన కుమారుడు శస్త్రచికిత్స నిపుణుడిగా ఉండడం వల్ల వచ్చిన ధైర్యాన్ని సర్దేశాయ్ గుర్తుచేసుకున్నారు. “నాన్న, నీకు క్యాన్సర్ ఉంటే.. ప్రోస్టేట్ క్యాన్సర్ రావడం ఒకరకంగా మంచిదే. ఎందుకంటే ఇది నెమ్మదిగా వ్యాపిస్తుంది, పూర్తిగా నయం చేయవచ్చు” అని కొడుకు చెప్పిన మాటలు తనలో నమ్మకాన్ని పెంచాయని తెలిపారు.
ఆ తరువాత ఆయన పలువురు క్యాన్సర్ నిపుణులను సంప్రదించారు. ఇతర క్యాన్సర్ సర్వైవర్స్ కథలు విన్నారు. అయితే, ధైర్యం ప్రకటనల్లో కనిపించదు. అది మనలోనే ఉంటుందని ఆయన అన్నారు.
ఆగస్టు మధ్యలో అపోలో హాస్పిటల్‌లో డాక్టర్ అంషుమన్ అగర్వాల్, డాక్టర్ జస్విందర్ పెంటెల్, డాక్టర్ గోపాల్ శర్మ పర్యవేక్షణలో రోబోటిక్ సర్జరీ జరిగింది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. తర్వాతి పరీక్షల్లో ఎటువంటి వ్యాప్తి జరగలేదని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన యాక్టివ్ సర్వైలెన్స్‌లో ఉన్నారు.
జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు, కానీ జీవించే అవకాశం ఊహకు అందని ఒక వరం: రాజ్‌దీప్ సర్దేశాయ్
భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో అత్యధికంగా నిర్ధారణ అయ్యే క్యాన్సర్‌గా రెండో స్థానంలో ఉంది. ప్రారంభ దశలో గుర్తిస్తే 5 సంవత్సరాల సర్వైవల్ రేట్ 64% వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ దీపావళి సందర్భంగా సర్దేశాయ్ తన వైద్య బృందానికి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, ఇండియా టుడే సహచరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “ఇంట్లో ఉండే ప్రేమ, ఆప్యాయతకు ప్రత్యామ్నాయం లేదు” అని ఆయన అన్నారు.
అలాగే దేశంలోని కోట్లాది భారతీయులకు సరసమైన క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని ప్రస్తావించారు. “బలమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థ, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రత్యేక వైద్యసేవలలో పెట్టుబడి ద్వారా మాత్రమే ప్రతి భారతీయుడికి రెండో అవకాశం లభిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి
జీవితం తాత్కాలికమని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని సర్దేశాయ్ చెప్పారు. ప్రజలు చిన్న సంతోషాలను పంచుకోవాలన్నారు. cansupport.org వంటి సంస్థలకు విరాళాలు ఇవ్వాలని సూచించారు. చిన్న విరాళం కూడా ఒకరి దీపావళిని మరింత ప్రత్యేకంగా, మధురంగా మార్చగలదని ఆయన నొక్కి చెప్పారు. “జీవితం ఎల్లప్పుడూ సులభం కాదు. కానీ దాన్ని జీవించే అవకాశం అనేది అర్థానికి మించిన ఆశీర్వాదం” అని ఆయన తన సందేశాన్ని ముగించారు.
రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రోస్టేట్ క్యాన్సర్ పోరాటం భారతీయ మీడియా ప్రపంచానికే కాదు ఎంతో మందికి ధైర్యం, ఆశ, కృతజ్ఞతలకు ప్రతీకగా నిలిచింది. ఆయన అనుభవం, వైద్య సాంకేతికతపై నమ్మకం, కుటుంబ మద్దతు, సామాజిక బాధ్యతపై అవగాహన కలిగిస్తుంది.
