Asianet News TeluguAsianet News Telugu

‘హత్యకు గురైన’ మహిళ అరెస్టు.. ఆమెను ‘చంపిన’ భర్తకు బెయిల్.. అసలేం జరిగిందంటే?

రాజస్తాన్‌లో ఓ మహిళను మర్డర్ చేసిన కేసులో ఇద్దరు నిందితులు జైల్లో ఉన్నారు. తాము ఆమెను చంపలేదని, ఫలానా చోటికి వెళితే ఆమె దొరుకుతుందని పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి వెళితే.. ఏడేళ్ల క్రితం హత్యకు గురైనట్టుగా భావించిన మహిళ కనిపించింది. ఆమెను అరెస్టు చేశారు. మర్డర్ నిందితులకు బెయిల్ లభించింది.
 

rajasthan woman faked murder, arrested after seven years, jailed husband got bail
Author
First Published Dec 13, 2022, 2:06 PM IST

జైపూర్: రాజస్తాన్‌లో ఓ విచిత్ర ఘటన ముందుకు వచ్చింది. భార్యను చంపేసిన కేసులో భర్త ఇన్నాళ్లు జైలులో ఉన్నాడు. కానీ, ఇప్పుడు ఆ హత్యకు గురైనట్టు భావించిన మహిళనే పోలీసులు అరెస్టు చేశారు. తాను అమాయకుడినని, తన భార్యను చంపలేదని మొదటి నుంచీ చెబుతున్న భర్తకు బెయిల్ వచ్చింది. తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పాడు. 

దౌసా జిల్లా మెహందీపూర్ బాలాజీ పోలీసులు శనివారం ఏడేళ్ల క్రితం హత్యకు గురైందని భావించిన మహిళను అరెస్టు చేశారు. ఆమె హత్యానేరం కేసులో ఇద్దరు జైలులో ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారంతోనే ఆ మహిళను పోలీసులు పట్టుకున్నారు.

2015లో బాధితుడు సోను.. ఆర్తి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భూమిని తన పేరిట చేయాలని ఆర్తి తన భర్తను కోరింది. డబ్బులను కూడా డిమాండ్ చేసింది. కానీ, అందుకు సోను అంగీకరించలేదు. ఆ పనులు తనతో కావలని స్పష్టం చేశాడు. అనంతరం, 8 రోజులకు ఆర్తి ఇంట్లో కనిపించకుండా పోయింది. దీంతో భర్త సోను చాలా చోట్ల భార్య కోసం వెతికాడు. కానీ, ఆయన భార్య దొరకలేదని సోను తమకు చెప్పినట్టు మెహందీపూర్ బాలాజీ పోలీసు స్టేషన్ అధికారి అజిత్ సింగ్ తెలిపారు.

ఆమె కనిపించకుండా పోయిన తర్వాత యూపీ పోలీసులకు మాథురలోని మగొర్ర కెనాల్‌లో ఓ మహిళ డెడ్ బాడీ కనిపించింది. ఆమె డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేశారు.

Also Read: ఇన్సూరెన్స్ కట్టి భార్యను చంపేసిన భర్త.. రూ. 1.90 కోట్ల కోసం ప్రణాళిక వేసి యాక్సిడెంట్

ఆ తర్వాత ఆరు నెలలకు ఆర్తి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన బిడ్డ కనిపించడం లేదని, ఆమె గురించి దర్యాప్తు చేయాలని సూరజ్ ప్రసాద్ గుప్తా కోరాడు. అతనికి కెనాల్‌లో కనిపించిన డెడ్ బాడీ ఫొటోలు, ఆమె దుస్తులు చూపించారు. ఆమె తన కుమార్తెనే అని సూరజ్ ప్రసాద్ గుప్తా గుర్తించాడు. అంతేకాదు, తన కూతురిని మెహందీపూర బాలాజీ ఏరియా నివాసులు సోను సైని, గోపాల్ సైనీలే చంపేశారని ఆరోపించారు.

దీంతో వారిద్దరిపై మర్డర్ కేసు నమోదైంది. ఈ కేసులోనే వారిద్దరూ జైలు పాలయ్యారు. కానీ, ఆ మహిళను తాము చంపలేదని, అసలు చనిపోనేలేదని తాము భావిస్తున్నట్టు పోలీసులకు తెలిపారు. కానీ, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. చివరకు వారే పోలీసులకు కొన్ని వివరాలు అందించారు. బహుశా ఫలానా చోటకు వెళితే హత్యకు గురైందని భావిస్తున్న, వాస్తవంలో జీవించే ఉన్న ఆ మహిళ లభించవచ్చని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఇచ్చిన వివరాలతోనే గాలింపులు జరపగా హత్యకు గురైందని భావించిన మహిళల దొరికింది.

ప్రస్తుతం ఆమె మర్డర్ కేసులో జైలులో ఉన్న ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. తమకు త్వరలోనే న్యాయం జరుగుతుందని వారు ఆశిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios