భర్త మీద ఉన్న కోపంతో ఓ మహిళ తన కన్న కొడుకునే అతి కిరాతకంగా హత్య చేసింది. అంతేకాకుండా పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ చివరకు అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకోగా..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ ఝంజును జిల్లాలోని బుధానియా గ్రామానికి చెందిన సునీత అనే మహిళకు చాలా సంవత్సరాల క్రితమే వివాహమైంది. అయితే... వివాహమైనప్పటి నుంచి భర్తతో ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు రోజు రోజుకీ భర్తపై కోపం ఎక్కవయ్యేది.

భర్తకి తన నాలుగేళ్ల కొడుకంటే అమితమైన ప్రేమ. దీంతో భర్తపై పగతీర్చుకోవాలంటే కొడుకును చంపాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం తన నాలుగేళ్ల కొడుకును తీసుకువెళ్లి నీళ్ల ట్యాంకులో ముంచి ప్రాణాలు తీసింది. అనంతరం అనుమానం రాకుండా ఉండాలని తన చేతి మణికట్టుని బ్లేడుతో కోసుకుంది.

Also Read విచిత్రం... ఒకే కాన్పులో ఆరుగురు జననం.. పుట్టిన కాసేపటికే.....

ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి కొడుకును చంపేసి.. తనని కూడా చంపడానికి ప్రయత్నించారని ఆమె పోలీసులకు చెప్పింది. అయితే... పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగు చూశాయి.

పిల్లాడి హత్య వెనుక సునీత హస్తం ఉందేమో అని అనుమానించిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేయగా అసలు నిజాలు వెలుగు చూశాయి. భర్త మీద కోపంతోనే ఇలా చేశానంటూ ఆమె చెప్పిన విషయం విని అందరూ షాకయ్యారు. కాగా సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.