రాజస్థాన్‌లో కొద్దిరోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి నేటి తెరపడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో సీఎం అశోక్ గెహ్లాట్ సర్కార్ గట్టెక్కింది.

మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిన స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌కు ఈ రోజు సభలో చివరి వరుసలో, ప్రతిపక్ష సభ్యులకు దూరంగా సీటు కేటాయించారు.

దీనిపై స్పందించిన సచిన్ పైలట్.. తాను కూర్చునే సీటును ప్రతిపక్షాలకు దగ్గరగా, అధికార పక్షానికి దూరంగా చివరన ఎందుకు కేటాయించారో తెలుసా..? ధైర్యవంతులు, శక్తిమంతులైన సైనికులనే ఎప్పుడూ సరిహద్దులకే పంపుతారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

Also Read:రాజస్థాన్ సంక్షోభం: విశ్వాస పరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కార్

కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బయటకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్, ప్రియాంకల రాయబారంతో సచిన్ కాస్త మెత్తబడ్డారు.

దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి 72 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరోవైపు స్వతంత్రులు , వివిధ పార్టీల ఎమ్మెల్యేలతో కలిపితే కాంగ్రెస్ బలం 125కి చేరుకుంటుంది.