రాను రాను సమాజంలో మానవ సంబంధాలకు విలువ అనేది లేకుండాపోతోంది. మనుషులు, వారి బంధాలు, అనుబంధాలపై చూపించాల్సిన ప్రేమంతా ఆస్తులు, డబ్బు సంపాదనపై పెట్టేస్తున్నారు. కన్న తల్లి, కడుపున పుట్టిన బిడ్డ అనే తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఆసక్తి కన్న తల్లిపైనే అకృత్యానికి పాల్పడ్డాడు.

 ఇల్లు తన పేర రాయలేదనే అక్కసుతో తల్లి స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీపక్‌ తివారి (50)అనే వ్యక్తి శివపురి ప్రాంతంలో ఉన్న తమ ఇంటిని తన పేరున రాయమంటూ కొంతకాలంగా తల్లి (75)ని వేధిస్తున్నాడు. అయితే.. ఆమె తన తదనంతరమే ఆ ఇంటిని బిడ్డలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కొడుకు అడిగినా ఇల్లు రాసివ్వలేదు.

దీంతో కన్నతల్లిపై అక్కసు పెంచుకున్నాడు. ఇటీవల మరణించిన తన తండ్రి దశదిన కర్మక్రియలు నిర్వహించే క్రమంలో తల్లిపై ఓ రసాయనాన్ని స్ర్పే చేశాడు. దీంతో ఆమె ఒళ్లంతా దురదలు రావడంతో.. స్నానం చేసేందుకు బాత్‌రూంలోకి వెళ్లింది. 

ఆ సమయంలో అతడు రహస్యంగా ఆమెను ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను బంధువులకు వాట్సా్‌పలో పోస్టు చేశాడు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె.. అవాక్కయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.