రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అనర్హత నోటీసును సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిని విచారించిన న్యాయస్థానం.. మంగళవారం వరకు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలను పదవుల నుంచి తొలగించింది కాంగ్రెస్ అధిష్టానం.

Also Read:ఆడియో టేపుల కలకలం: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు

ఈ క్రమంలో హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ నేతలతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేసిన ఆరోపణలతో రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. వారికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

అయితే కాంగ్రెస్ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రెబల్ ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు. ఆడియో టేపుల్లో వున్నది తమ గొంతు కాదని చెబుతున్నారు. అసెంబ్లీలో తమకు 109 మంది సభ్యుల బలం వుందని వారు చెబుతున్నారు.