దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వారు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర చికిత్సకు సంబంధించి ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆక్సిజన్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు.

దీంతో ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ సకాలంలో అందక.. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను నివారించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని అందుకోవాలంటే కొన్ని మార్గదర్శకాలను సైతం సీఎం తెలిపారు. కోటి రూపాయలు పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి వుంటుంది.

Also Read:రేపటి నుంచి 18 ఏళ్లు పైబడినవారికి టీకా: చేతులెత్తేసిన జగన్, ఈటెల

అలాగే, సెప్టెంబరు 30 నాటికి ప్లాంట్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాలి.. దీనికి ముందుకొచ్చే వారికి ఎంఎస్ఎంఈ చట్టం-2019 ప్రకారం మూడేళ్లపాటు రెగ్యులారిటీ అప్రూవల్స్, ఇన్‌స్పెక్షన్స్ నుంచి మూడేళ్లపాటు మినహాయింపు ఇస్తామని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.

అలాగే, ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం తీసుకుని ఇప్పిస్తుంది. వీటికి తోడు ప్లాంట్‌కి కావాల్సిన నీరు, విద్యుత్ కనెక్షన్ వంటి వాటిని సమకూరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్లాంట్, యంత్ర సామాగ్రి, ఇతర పరికరాలపై 25 శాతం (గరిష్టంగా రూ. 50 లక్షలు) రెండు విడతలుగా మూలధనం కింద మంజూరు చేస్తుంది.