రాజస్థాన్ రాజధాని జైపూర్ జిల్లాలో డిప్యూటీ ఎస్పీ శివకుమార్, ఎమ్మెల్యే గోపాల్ మీనాపై ఓ దళిత వ్యక్తిపై అమానుషంగా ప్రవరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డిప్యూటీ ఎస్పీ శివకుమార్ భరద్వాజ్ తనపై దాడి చేసి ముఖంపై మూత్ర విసర్జన చేశారని బాధితుడు ఆరోపించారు. అదే సమయంలో ఎమ్మెల్యే గోపాల్ మీనా కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.
గత నెలలో మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై బీజేపీ కార్యకర్త మూత్ర విసర్జన చేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కార్యకర్త చేసిన నీచమైన చర్యకు సంబంధించిన వీడియో బయటపడటంతో తెరపైకి వచ్చింది. ఈ ఘటనను చూసి.. దేశం మొత్తం అసహనం వ్యక్తం చేసింది. తాజాగా రాజస్థాన్‌లో అలాంటి అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత వ్యక్తిపై పోలీస్ ఉన్నతాధికారి అమానుషంగా వ్యవహరించాడు. విచక్షణారహితంగా దాడి చేసి అతడిపై మూత్ర విసర్జన చేయడం.. పైగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బూట్లు నాకించాడు. జైపూర్ జిల్లాలోని జామ్‌వరంగఢ్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జైపూర్ జిల్లాలోని జామ్‌వరంగఢ్ డిప్యూటీ ఎస్పీ శివకుమార్ భరద్వాజ్ తనపై దాడి చేసి తన ముఖంపై మూత్ర విసర్జన చేశాడని 51 ఏళ్ల దళిత వ్యక్తి ఆరోపించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా ఎదుటే డిప్యూటీ ఎస్పీ ఈ నీచమైన పని చేశాడని బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధితురాలి తరపున నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా, 6-7 మంది పోలీసుల పేర్లు కూడా ఉన్నాయి.
వివరాల్లోకెళ్లే.. జైపూర్ జిల్లా జమ్‌వరంగఢ్ తహసీల్‌లోని జైచంద్‌పురా గ్రామ నివాసి. 51 ఏళ్ల బాధితుడు తొడల్డి గ్రామంలోని పొలంలో పనిచేస్తున్నాడు. జూన్ 30వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు పొలంలో పనిచేస్తున్నప్పుడు.. కొంత మంది పోలీసులు కారులో వచ్చారు. వారు ఆ దళిత వ్యక్తిని బలవంతంగా పట్టుకుని కారులో ఎక్కించి, జామ్‌వరంగఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా ఇంటికి తీసుకెళ్లారు. అతడిపై దాడి చేసి ఓ గదిలో బంధించారు. కొద్దిసేపటికి డిప్యూటీ ఎస్పీ శివకుమార్ భరద్వాజ్, నలుగురైదుగురు పోలీసులు కూడా ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు. బాధితుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ తరుణంలో డిప్యూటీ ఎస్పీ తన ముఖంపై మూత్రం పోశాడని బాధితుడు ఆరోపించాడు. కులపరమైన అభ్యంతరకర పదాలను ఉపయోగించి దూషణలు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా కూడా తనతో అమానుషంగా ప్రవర్తించాడనీ, తన బూట్లు నాకించాడని బాధితుడు ఆరోపించాడు. తనను ఎమ్మెల్యే గోపాల్ మీనా గదిలోకి తీసుకెళ్లగా.. చంపవద్దని వారి కాళ్లపై పడి ప్రాధేయపడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తరుణంలో ఎమ్మెల్యే గోపాల్ మీనా తన షూలను నాలుకతో శుభ్రం చేయమని హుకుం జారీ చేశాడనీ, తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే బూట్లను నాలుకతో నాకినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే డా.పరం, రిటైర్డ్ డీజీ నవదీప్ సింగ్ కూడా అక్కడికి వచ్చారని బాధితురాలు తెలిపారు.
నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశం
తనపై దాడి చేసి మూత్ర విసర్జన చేసిన ఘటన జూన్ 30న జరిగిందని బాధితుడు చెబుతున్నాడు. కొన్ని రోజులు భయంతో ఇంట్లోనే ఉన్నాననీ, జూలై 7న ధైర్యం చేసి.. తాను జామ్‌వరంగఢ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నట్టు తెలిపారు. కానీ, తన ఫిర్యాదు తీసుకోవడానికి బదులుగా పోలీసులు తనని బెదిరించి అక్కడి నుండి తరిమికొట్టారని పేర్కొన్నారు.
మరుసటి రోజు (జూలై 8న) తాను జైపూర్ రూరల్ ఎస్పీ, డీజీపీని కూడా కలిశాననీ, కేసు నమోదు చేయాలని కోరినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదనీ, చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు జామ్‌వరంగఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు కూడా ఉంది. దీంతో దర్యాప్తును సీఐడీ సీబీకి అప్పగించారు. ఫిర్యాదుదారు మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే వల్ల తనకు, తన కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు.
