Rajasthan Assembly polls: రాజస్థాన్‌లో ఓటేసేందుకు బారులు తీరిన జనం.. 5 గంటల వరకు 68.24 శాతం పోలింగ్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 68.24 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యాహ్నం 3 గంటల వరకు 55.63 శాతం పోలింగ్ నమోదైంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 68.24 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీ ప్రకారం బాగిదొరలో 78.21 శాతం , జైపూర్‌లో 69.22 శాతం , జైసల్మేర్‌లో 76.57 శాతం, గంగానగర్‌లో 72.09 శాతం పోలింగ్ నమోదైంది. పోకరన్ నియోజకవర్గంలో అత్యధికంగా 81.12 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యాహ్నం 3 గంటల వరకు 55.63 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ మృతి చెందడంతో కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 51,507 పోలింగ్ స్టేషన్లలో 183 మంది మహిళా పోటీదారులతో సహా 1,875 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5,26,90,146 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝలారాపటన్ నుంచి పోటీ చేస్తున్నారు. 2003 నుంచి ఇక్కడ బీజేపీ అభ్యర్ధి గెలుస్తూనే వస్తున్నారు. టోంక్ నుంచి కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు , రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బిజెపి అభ్యర్ధి అజిత్ సింగ్ మెహతాతో తలపడనున్నారు. 2018లో పైలట్ 54,179 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన యూనుస్ ఖాన్‌ను ఓడించారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, లచ్మాన్‌గఢ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి సుభాష్ మెహ్రియాపై పోటీ చేస్తున్నారు.
రాజస్థాన్‌లో శాంతియుతంగా ఓటింగ్ జరిగేందుకు 1,02,290 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. 69,114 మంది పోలీసు సిబ్బంది.. 32,876 మంది రాజస్థాన్ హోంగార్డ్, ఫారెస్ట్ గార్డ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. అలాగే 700 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను దించారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు.