Rajasthan: బీజేపీ లిస్టులో అసమ్మతి నేత వసుంధర రాజే, ఫస్ట్ లిస్టులో కాంగ్రెస్ ఫైటర్లు పైలట్, గెహ్లాట్
రాజస్తాన్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా అసంతృప్త నేతలను దృష్టిలో పెట్టుకుని ఈ జాబితాలు విడుదలయ్యాయి. కాంగ్రెస్ తొలి జాబితాలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లను ప్రకటించగా.. బీజేపీ రెండో జాబితాలో అసమ్మతి నేత వసుంధర రాజేను ప్రకటించి డ్యామేజీ కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేసింది.
న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు అంతర్గత కుమ్ములాటలతో బాధపడుతున్నాయి. అధికార పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ లీడర్ సచిన్ పైలట్‌ల మధ్య తరుచూ అసమ్మతి సెగలు బయటికి వస్తుండగా.. కొన్నాళ్లుగా బీజేపీలో వసుంధర రాజే వ్యతిరేకత బయటపడుతున్నది. వీరిని సద్దుమణిగించడానికి ఉభయ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, ఈ కీలక నేతల అభ్యర్థిత్వాలను పార్టీలు ప్రకటించాయి.
బీజేపీ 83 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో వసుంధర రాజే ఉన్నారు. ఆమె మద్దతుదారులకూ టికెట్లు దక్కాయి. వసుంధర రాజే ఆమె సాంప్రదాయ సీటు జల్‌రపటన్ నుంచి బరిలో నిలుస్తున్నారు.
గజేంద్ర సింగ్ షెకావత్‌ను రాజస్తాన్ పార్టీ చీఫ్‌గా నియమించినప్పటి నుంచి వసుంధర రాజే అసమ్మతితో ఉన్నారు. ఆయన నియామకం జాట్ కమ్యూనిటీని పార్టీకి దూరం చేయడమే అవుతుందని ఆమె కామెంట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఆమె క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరగడం చూశాం. బీజేపీ కూడా ఆమెను దూరంగానే పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ తొలి జాబితాలో ఆమె పేరు కనిపించలేదు. దీనిపై పార్టీ వర్గాల నుంచి, అధికార పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, పార్టీ వెంటనే అలర్ట్ అయి నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. రెండో జాబితాలో వసుంధర రాజే పేరుతోపాటు ఆమెతో సన్నిహితంగా ఉండే నేతలకూ టికెట్లు ఇచ్చింది.
2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం సీటు పై ఆశలు పెంచుకున్న సచిన్ పైలట్ ఇప్పటి వరకూ తరుచూ తన అసమ్మతిని బయటపెడుతూ వచ్చారు. 2020లో సీఎం అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు కూడా చేశారు. వీరిద్దరినీ ఏకతాటి మీదికి తేవడానికి కాంగ్రెస్ హైకమాండ్ అనేక ప్రయత్నాలు చేసింది. తాజాగా, ఇద్దరూ కలిసిపోవాలన్నట్టుగా వ్యవహరిస్తున్నప్పటికీ అసంతృప్తి బయట పడుతూనే ఉన్నది. గత నెలలోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఎన్నికల బరిలోకి దిగుతుందని పైలట్ అన్నారు. మొన్ననే గెహ్లాట్ మాత్రం సీఎం సీటు తనను వదలడం లేదే.. అంటూ పరోక్షంగా పైలట్‌కు తగిలేటట్టుగానే కామెంట్ చేశారు.
Also Read: పురుగుల మందుతో మోత్కుపల్లి హల్‌చల్.. ‘నా చావుకు కేసీఆర్ ముహూర్తం పెట్టాలే’
కర్ణాటకలో సిద్ధరామయ్యను, డీకే శివకుమార్‌ను ఏకతాటిమీదికి తెచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడా అదే మ్యాజిక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నది. తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలోనూ ఇద్దరికీ ప్రయారిటీ ఇస్తూ పేర్లను ప్రకటించింది. సచిన్ పైలట్‌ను టోంక్ నుంచి, అశోక్ గెహ్లాట్‌ను సర్దార్‌పురా నుంచి బరిలోకి దించుతున్నది.
రాజస్తాన్‌లోనూ ప్రతిపక్ష పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నది.