జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన లభించిన సంగతి తెలిసిందే. కొన్ని పార్టీలు కేంద్రప్రభుత్వానికి మద్ధతు తెలపగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ అంశంపై జమ్మూకాశ్మీర్ చివరి రాజు హరిసింగ్ కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ స్పందించారు. కాశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా ఖండించాల్సిన పనిలేదని కరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరపాలని.. అలాగే ఇప్పటికే అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే లడఖ్‌‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రతిపాదనను ఆయన ఆహ్వానించారు.

ఆర్టికల్ 35ఏ రద్దుకు మద్ధతునిస్తూనే.. కాశ్మీర్‌లో లింగ వివక్షను పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రతిపాదించారు. జమ్మూ, కాశ్మీర్ మధ్య రాజకీయ అధికారాలను పునర్విభజన బిల్లుపై సరైన రీతిలోనే విభజిస్తుందని కరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

కాగా.. ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.